Share News

రైల్వే బడ్జెట్‌లో.. రాష్ట్రానికి 10134 కోట్లు

ABN , Publish Date - Feb 03 , 2026 | 06:23 AM

కేవలం రూ.886 కోట్లే కేటాయించగా.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు అందుకు 11 రెట్లు ఎక్కువగా కేటాయించామన్నారు. సోమవారం ఢిల్లీలోని రైల్వేభవన్‌లో వైష్ణవ్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు.

రైల్వే బడ్జెట్‌లో..  రాష్ట్రానికి 10134 కోట్లు

  • గతేడాది కంటే 717 కోట్లు అదనం: రైల్వే మంత్రి

  • 2014 నుంచి ఏపీలో కొత్తగా 1,700 కి.మీ ట్రాక్‌

  • 3,418 కోట్లతో 73 ‘అమృత్‌ స్టేషన్ల’ అభివృద్ధి

  • హైదరాబాద్‌-చెన్నై బుల్లెట్‌ రైలుతో రాష్ట్రానికి మేలు

  • అతిపెద్ద ఎకనామిక్‌ కారిడార్‌ అవుతుంది

  • ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్‌-చెన్నై మధ్య ప్రయాణ సమయం 2.55 గంటలే

  • ఫాస్ట్‌ ట్రాక్‌లో విశాఖ రైల్వే జోన్‌

  • అపోహలొద్దు.. పనులు వేగంగా

  • జరుగుతున్నాయ్‌.. గత జోన్లలా 3-4 ఏళ్లు పట్టదు

  • అతి త్వరలోనే కార్యాలయ నిర్మాణ పనులు

  • పరిపాలనా భవన నిర్మాణానికీ సన్నాహాలు: వైష్ణవ్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): కేంద్ర బడ్జెట్‌లో రైల్వేలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యం దక్కింది. గతేడాది బడ్జెట్‌లో రాష్ట్రానికి రూ.9,417 కోట్లు ఇవ్వగా.. ఈసారి దానికి అదనంగా రూ.717 కోట్లు కేటాయించింది. ఈ దఫా ఏపీలోని రైల్వే ప్రాజెక్టుల కోసం రికార్డు స్థాయిలో రూ.10,134 కోట్లు కేటాయించినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. 2009-14 మధ్య ఉమ్మడి రాష్ట్రానికి కలిపి సగటున ఏడాదికి కేవలం రూ.886 కోట్లే కేటాయించగా.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు అందుకు 11 రెట్లు ఎక్కువగా కేటాయించామన్నారు. సోమవారం ఢిల్లీలోని రైల్వేభవన్‌లో వైష్ణవ్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాలకు రైల్వే శాఖ కేటాయింపులను వివరించారు. ‘ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం రూ.92,649 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. 2014 నుంచి రాష్ట్రంలో కొత్తగా 1,700 కి.మీ మేర రైల్వే ట్రాక్‌ను నిర్మించాం. ఇది శ్రీలంక రైల్వే నెట్‌వర్క్‌ కంటే ఎక్కువ. ఏపీలో 73 స్టేషన్లను ‘అమృత్‌ స్టేషన్‌’ పథకం కింద అభివృద్థి చేస్తున్నాం. ఇందుకోసం రూ.3,418 కోట్లు ఖర్చు చేస్తున్నాం.


ఇప్పటికే సూళ్లూరుపేట, రాయనపాడు, కాకినాడ టౌన్‌, మంగళగిరి, తుని స్టేషన్ల పనులు పూర్తయ్యాయి. రాష్ట్రంలో రైల్వే లైన్ల విద్యుదీకరణ 100శాతం పూర్తయింది. 2014 నుంచి 1,949 కి.మీ మేర రైల్వే లైన్లు విద్యుదీకరించాం. 805 ఫ్లై ఓవర్లు, అండర్‌పా్‌సలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 8 జతల వందే భారత్‌ రైళ్లు, 8 జతల అమృత్‌ భారత్‌ రైళ్లు నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా మీదుగా వెళ్లే అత్యంత కీలకమైన కోల్‌కతా-చెన్నై రైల్వే లైన్‌ను నాలుగు లైన్లుగా విస్తరించబోతున్నాం’ అని తెలిపారు. హైదరాబాద్‌-చెన్నై బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో మేలు జరుగుతుందన్నారు. దీనికి సంబంధించిన ఫైనల్‌ అలైన్‌మెంట్‌, డీపీఆర్‌ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని చెప్పారు. ‘ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్‌-చెన్నై మధ్య ప్రయాణ సమయం కేవలం 2 గంటల 55 నిమిషాలకు తగ్గిపోతుంది. ఈ ప్రాజెక్టు ఏపీకి అతిపెద్ద ఎకనామిక్‌ కారిడార్‌గా ఉపయోగపడుతుంది’ అని తెలిపారు. ప్రయాణికుల భద్రత కోసం రైల్వే శాఖ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కవచ్‌ రక్షణ వ్యవస్థను రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ శరవేగంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఏపీలో ఇప్పటికే 3,137 కి.మీ. మేర కవచ్‌ వ్యవస్థ మంజూరు కాగా.. 2,507 కి.మీ. పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. 130 కి.మీ. వరకు ఈ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలిసికట్టుగా పనిచేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు జమ చేయాల్సిన ప్రాజెక్టుల విషయంలోనూ చర్చిస్తూ, పనులు త్వరగా మొదలయ్యేలా చూస్తున్నామని తెలిపారు. రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు 5,454 కోట్లు కేటాయించామని చెప్పారు.


కొత్త జోన్‌ ఏర్పాటు సులభం కాదు

విశాఖపట్నం రైల్వే జోన్‌(దక్షిణ కోస్తా రైల్వే జోన్‌) ఏర్పాటుపై రైల్వే మంత్రి మాట్లాడుతూ.. జోన్‌ ఏర్పాటు ప్రక్రియ ఎక్కడా ఆగలేదన్నారు. పనులు ముమ్మరంగా సాగుతున్నాయని స్పష్టం చేశారు. రైల్వే జోన్‌ కార్యాలయ నిర్మాణ పనుల ను అతి త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. పరిపాలనా భవన నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయని, ఈ ప్రక్రియ అంతా సాఫీగా సాగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కొత్త జోన్‌ ఏర్పాటు బయటకు కనిపించినంత సులభం కాదని వ్యాఖ్యానించారు. ఒక జోన్‌ నుంచి రైలు మరో జోన్‌కు మారినప్పు డు మొత్తం స్టాఫ్‌, కంట్రోల్‌ రూం మారతాయ ని.. కమాండ్‌ సిస్టమ్‌, రైళ్ల టైమ్‌ టేబుల్స్‌ అన్నీ మార్చాల్సి ఉంటుందని.. చెప్పారు. అందుకే దీనిపై లోతుగా కసరత్తు చేస్తున్నామన్నారు. గతంలో ఏదైనా కొత్త రైల్వే జోన్‌ ప్రకటిస్తే.. అది పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి 3-4 ఏళ్లు పట్టేదని.. కానీ విశాఖ జోన్‌ విషయంలో తామంత సమయం తీసుకోవడం లేదని తెలిపారు. జోన్‌ విషయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడితో తాను చర్చిస్తున్నట్లు చెప్పారు.

Updated Date - Feb 03 , 2026 | 06:28 AM