కౌన్ బనేగా.. చైర్‌పర్సన్?
ABN , Publish Date - Feb 14 , 2026 | 10:09 AM
సత్తుపల్లి మున్సిపాలిటీ జనరల్ మహిళకు రిజర్వ్ అయిన చైర్‌పర్సన్ పదవి -దక్కించుకునేందుకు ప్రధానంగా ముగ్గురు కౌన్సిలర్లు పోటీ పడుతున్నారు. ఓట్ల లెక్కింపు ముగియగా.. సత్తుపల్లి మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
సత్తుపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠం రేసులో ముగ్గురు కౌన్సిలర్లు
రంగంలోకి దిగిన కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్యనేతలు
ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీ బిజీ...
సత్తుపల్లి మున్సిపాలిటీ (Sattupalli Municipality) జనరల్ మహిళకు రిజర్వ్ అయిన చైర్‌పర్సన్ పదవి -దక్కించుకునేందుకు ప్రధానంగా ముగ్గురు కౌన్సిలర్లు పోటీ పడుతున్నారు. ఓట్ల లెక్కింపు ముగియగా.. సత్తుపల్లి మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మొత్తం 23వార్డుల్లో కాంగ్రెస్ 17 కౌన్సిలర్లను గెలుచుకోవడంతో అందరి దృష్టి చైర్‌పర్సన్ పీఠంపై పడింది. ఇప్పటి వరకూ ఎన్నికల బరిలో గెలుపొందిన కౌన్సిలర్లు ప్రస్తుతం చైర్‌పర్సన్ పీఠంపై దృష్టిసారి౦చారు. అధిష్టానం తమకు అవకాశం ఇస్తుందని ఎవరికి వారే తమ ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో అధిష్ఠానం ఎవరివైపు మొగ్గు చూపుతుందోనని పార్టీ కార్యకర్తలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. సత్తుపల్లి మున్సిపాలిటీలో గెలుపొందిన వారిలో ప్రధానంగా ఆరవ వార్డు నుంచి తోట సుజలారాణి, మూడు వార్డు నుంచి ఎన్నికైన బొంతు సుమలత, 22వ వార్డు నుంచి గెలుపొందిన ఎండీ. రెహెనా బేగంలు చైర్‌పర్సన్ పదవి రేసులో ఉన్నట్లు తెలిసింది. 10 వార్డులో గెలుపొందిన మట్టా దేవజ్యోతి కూడా చైర్‌పర్సన్ అంటూ ఎన్నికల సమయంలో ప్రచారం జరిగినప్పటికీ.. ఆమె చైర్‌పర్సన్ రేసులో లేరని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ ప్రకటించారు. దీంతో ప్రస్తుతానికి ఆ ముగ్గురే రేసులో ఉన్నట్లు సమాచారం.
-- సత్తుపల్లి, ఆంధ్రజ్యోతి
చైర్‌పర్సన్ కుర్చీ కోసం ఎన్నికైన కౌన్సిలర్లు ఎవరికి వారే తమ ప్రయతాల్లో బిజీగా ఉన్నారు. ఫలితాలు వెలువడిన వెంటనే చైర్‌పర్సన్ సీటు కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిసింది. తోట సుజలారాణికి గతంలో మూడుసార్లు కౌన్సిలర్‌గా ఎన్నిక కాగా పాలకవర్గంలో వైస్ చైర్‌పర్సన్‌గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. రెహెనాబేగం 2005లో కౌన్సిలర్‌గా పని చేశారు. బొంతు సుమలత మొదటిసారి పోటీచేసి కౌన్సిలర్‌గా గెలుపొందారు. తనకు ఉన్న అనుభవం కారణంగా చైర్‌పర్సన్‌గా అవకాశం ఇవ్వాలని తోట నుజలారాణి కోరుతున్నారు. ఆమె నామినేషన్ వేసిన నాటి నుంచి చైర్‌పర్సన్ రేసులో ఉన్నారు. ఆమె స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుపై నమ్మకంతో ముందుకు సాగుతున్నారు. రెహెనాబేగం పరి కూడా ఇందుకు భిన్నంగా లేదు.
ఆమె భర్త కమల్‌పాషా, కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్, ఎమ్మెల్యే డాక్టర్ రాగమయికి విధేయుడిగా ఉన్నారు. మట్టా కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం తనకు కలిసి వచ్చే అంశంగా భావిస్తూ ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది. మరోపక్క కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్ బొంతు సుమలత మొదటి నుంచి చైర్‌పర్సన్ రేసులో లేకపోయినా ప్రతిష్టాత్మకంగా జరిగిన పోటీలో గెలుపొందడంతో పాటు ప్రధాన సామాజికవర్గం నుంచి గెలుపొందిన ఆమె ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆమె తరపున పలువురు నాయకులు ఇప్పటికే రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. సుమలత సామాజికవర్గానికి రాష్ట్రంలోని ఏ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ పదవి దక్కకపోతే.. సత్తుపల్లిలో ఆమెకు ఆ అవకాశం కల్పించాలని ఆమె మద్దతుదారులు కోరుతున్నారు. ఈ మేరకు ఎవరికి వారు తమ బయోడేటాలను సిద్ధం చేసి అధిష్టానానికి, స్థానిక నాయకత్వానికి అందజేశారు. చైర్‌పర్సన్‌గా తమకు మద్దతు ఇవ్వాలని తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను ఇద్దరు కౌన్సిలర్ల మద్దతుదారులు కోరినట్లు తెలుస్తోంది. ఎవరి ప్రయత్నాల్లో వారున్నప్పటికీ చివరికి స్థానిక ఎమ్మెల్యే నిర్ణ యమే ఫైనల్ కానుంది. ఏకాభిప్రాయం వ్యక్తం కాకపోతే అధిష్టాన పెద్దలు రంగంలోకి దిగే అవకాశం ఉందని పలువురు నాయకులు భావిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్... ఉమ్మడి వరంగల్ జిల్లాలో గెలుపు ఎవరిదంటే..
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్... ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలుపు ఎవరిదంటే..
Read Latest Telangana News And AP News And Telugu News