కండక్టర్ ప్రవళికకు కన్నీటి వీడ్కోలు
ABN , Publish Date - Nov 05 , 2026 | 05:18 AM
ప్రయాణికురాలి దాడిలో గాయపడి, చికిత్స పొందుతూ మృతి చెందిన కండక్టర్ గుండ్ల ప్రవళికకు ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు కన్నీటి వీడ్కోలు పలికారు.
మణుగూరులో అంతిమ సంస్కారాలు..
నివాళులర్పించిన కార్మికులు, ఉద్యోగులు
ఖమ్మం రీజియన్‌లో బస్సుల బంద్
విధులు బహిష్కరించిన ఉద్యోగులు
రాష్ట్రవ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో నిరసన
కండక్టర్ మృతిపై సీఎం రేవంత్ దిగ్ర్భాంతి
ప్రవళికపై దాడికి పాల్పడిన
మహిళపై హత్య కేసు నమోదు
మణుగూరు/అశ్వాపుం/ఖమ్మం/ఖానాపురం హవేలి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ప్రయాణికురాలి దాడిలో గాయపడి, చికిత్స పొందుతూ మృతి చెందిన కండక్టర్ గుండ్ల ప్రవళికకు ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు కన్నీటి వీడ్కోలు పలికారు. తమతో కలిసి పనిచేసిన కండక్టర్ ఇక లేదంటూ సహ ఉద్యోగినులు కన్నీటిపర్యంతమయ్యారు. గతనెల 25న చిల్లర డబ్బుల విషయమై గొడవపడిన ప్రయాణికురాలు బస్సులో నుంచి తోసేయడంతో తీవ్రంగా గాయపడిన ప్రవళిక.. మంగళవారం రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రవళిక మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మ ణుగూరుకు తీసుకురాగా.. కుటుంబసభ్యులు, తోటి కార్మికులు ఘనంగా నివాళులర్పించారు.
ప్రవళిక మృతదేహాన్ని తొలుత మణుగూరు డిపో వద్ద సందర్శనకు ఉంచగా ఆర్టీసీ ఖమ్మం ఆర్‌ఎం సరిరామ్‌తో పాటు పలువురు ఆర్టీసీ ఉన్నతోద్యోగులు సంతాపం తెలిపారు. ‘తల్లీ.. ప్రవల్లికా.. లే అమ్మా.. నాకు ఇంకెవ్వరు ఉన్నారమ్మా.. ఒంటరి దాన్ని చేసి వెళ్లిపోయావా’ అంటూ ప్రవళిక తల్లి విజయలక్ష్మి గుండెలవిసేలా రోదించారు. ఇతర కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, పలువురు కాంగ్రెస్ నాయకులు ప్రవళిక మృతదేహం వద్ద నివాళులర్పించారు. అమర్ రహే ప్రవళిక అమర్ ర హే, వీ వాంట్ జస్టిస్ అంటూ కార్మికులు నినాదాలు చేశారు. వందలాది మంది కార్మికులు, ప్రవళిక కుటుంబ సభ్యుల కన్నీటి మధ్య అంతిమయాత్ర నిర్వహించి.. మణుగూరు శివారులోని కట్టుమల్లారం వద్ద అంత్యక్రియలు చేశారు.
కాగా, ప్రవళిక మృతికి సంతాపంగా ఖమ్మం రీజియన్‌లో బుధవారం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు, కార్మికులు విధులు బహిష్కరించి బస్సుల బంద్ నిర్వహించారు. ఉదయం నుంచే ఖమ్మం రీజియన్ పరిధిలోని 7డిపోల వద్ద ఆందోళనకు దిగారు. ప్రవళిక మృతికి కారకురాలైన మహిళను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. ప్రవళిక కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులపై దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఖమ్మం రీజియన్‌లో రోజూ 515 బస్సులు నడుస్తుండగా.. బుధవారం 37సర్వీసులే నడిచాయి. మధ్యాహ్నం తర్వాత సర్వీసులను పునరుద్ధరించామని అధికారులు తెలిపారు.
తండ్రి చనిపోయాక.. కండక్టర్‌గా..
మణుగూరు డిపోలో ఫిట్టర్‌గా పని చేసే నాగరాజు పది నెలల క్రితం మృతి చెందారు. కారుణ్య నియామకం కింద ఆయన కూతురు బీఈడీ చదివిన ప్రవళికకు కండక్టర్‌గా ఉద్యోగం వచ్చింది. మణుగూరు డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న ఆమె ఓ మహిళా ప్రయాణికురాలి చేతిలో దాడికి గురై, పది రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొంది మరణించింది. ప్రస్తుతం తల్లితో కలిసి మణుగూరులో అద్దె ఇంట్లో ఉంటున్న ప్రవళిక త్వరలోనే ఓ ఇల్లు కొనుక్కోవాలని, ఆతర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇంతలోనే ఇంతటి దారుణం జరగడంతో కుటుంబసభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. ప్రవళిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని బుధవారం ఓ ప్రకటనలో హామీ ఇచ్చారు. కాగా, మహిళా కండక్టర్‌పై దాడికి పాల్పడ్డ బానోతు మౌనికపై తొలుత హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు.. తాజాగా హత్య కేసు నమోదు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మత్స్యకారులను కాపాడబోయి.. వరద నీటిలో సహాయక సిబ్బంది గల్లంతు
స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు ఇక సులువుగా ఫైర్ ఎన్‌వోసీ!
7 గంటల్లో రూ.7.80 కోట్లు స్వాహా
Read Latest Telangana News And AP News And National News
And Telugu News