Share News

మత్స్యకారులను కాపాడబోయి.. వరద నీటిలో సహాయక సిబ్బంది గల్లంతు

ABN , Publish Date - Nov 05 , 2026 | 04:57 AM

చెరువు అలుగు పోస్తుందని.. చేపలు బయటకు వెళ్లిపోతాయని వలలు కట్టేందుకు వెళ్లి.. మత్స్యకారులు వరదలో చిక్కుకోగా.. వారిని కాపాడేందుకు 10 మంది ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, మరో స్థానికుడు వెళ్లి.. బోట్లు తిరగబడడంతో వరదలో కొట్టుకుపోయారు.

మత్స్యకారులను కాపాడబోయి.. వరద నీటిలో సహాయక సిబ్బంది గల్లంతు
SDRF Personnel Missing

  • బోట్లు తిరగబడటంతో కొట్టుకుపోయిన..

  • 10 మంది ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, ఓ స్థానికుడు

  • అధికార వర్గాల్లో తీవ్ర ఆందోళన.. గాలింపు

  • క్షేమంగా ఉన్నామంటూ అర్ధరాత్రి సమాచారం

  • షేర్‌ చేసిన లొకేషన్‌లో నలుగురి గుర్తింపు

  • మిగిలిన వారి కోసం కొనసాగుతున్న గాలింపు

ఖమ్మం (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/సత్తుపల్లి, నవంబరు3: చెరువు అలుగు పోస్తుందని.. చేపలు బయటకు వెళ్లిపోతాయని వలలు కట్టేందుకు వెళ్లి.. మత్స్యకారులు వరదలో చిక్కుకోగా.. వారిని కాపాడేందుకు 10 మంది ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, మరో స్థానికుడు వెళ్లి.. బోట్లు తిరగబడడంతో వరదలో కొట్టుకుపోయారు. అర్ధరాత్రి వరకు గాలింపు చేపట్టి నలుగురు సిబ్బందిని రక్షించారు. మిగిలిన వారికోసం గాలింపు కొనసాగుతోంది. ఈ ఘటన బుధవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లిలో చోటుచేసుకుంది. మురసు తుఫాన్‌ కారణంగా రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి వచ్చిన వరదతో బేతుపల్లి పెద్ద చెరువు అలుగు పోస్తోంది. దీంతో చెరువులోని చేపలు బయటకు వెళ్లకుండా వలలు ఏర్పాటు చేసేందుకు మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో 8 మంది జాలర్లు అలుగు వద్దకు చేరుకున్నారు.


ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో వారంతా అక్కడే చిక్కుకుపోయారు. స్థానికుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, రెస్క్యూ బృందాన్ని రప్పించారు. తొలుతు ఒక బోటులో వెళ్లిన సిబ్బంది ముగ్గురు మత్స్యకారులను సురక్షితంగా చెరువు కట్టమీదకు తీసుకువచ్చారు. ఆ తర్వాత రెండు బోట్లలో 10 మంది ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, వారికి సాయంగా స్థానికుడైన బి.రాజు బయలుదేరారు. అయితే వరద ఉధృతికి రెండు బోట్లు తిరగబడి మొత్తం 11 మంది కొట్టుకుపోయారు. వరద ఉధృతికి కొట్టుకుపోయిన వారు ఏమయ్యారో తెలియకపోవడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. దీనిపై కలెక్టర్‌ దివాకరకు సమాచారం అందించడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.


ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌దత్‌, కొత్తగూడెం ఎస్పీ రోహిత్‌రాజు కూడా చెరువు వద్దకు చేరుకుని గాలింపు చర్యలను పర్యవేక్షించారు. ఓవైపు కొట్టుకుపోయిన వారి కోసం గాలింపు కొనసాగిస్తూనే అలుగు వద్ద చిక్కుకున్న మిగిలిన ఐదుగురు మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఈ క్రమంలో రాత్రి 11.30 గంటల సమయంలో తాము వరదలో మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నామంటూ కొట్టుకుపోయినవారు సెల్‌ఫోన్‌ ద్వారా లొకేషన్‌ పంపించారు. దీంతో ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ బృందం బోటులో బయలుదేరి.. వారు పంపిన లొకేషన్‌లో నలుగురిని గుర్తించి కాపాడింది. మిగిలిన వారు ఎంతదూరంలో ఉన్నారు, ఏమయ్యారన్నది ఇంకా తెలియలేదు. అర్ధరాత్రి 12 గంటల తరువాత కూడా గాలింపు కొనసాగుతోంది. సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి చెరువు వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. బాధితులందరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చాలని ఆదేశించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ఎప్పటికప్పుడు అధికారులతో ఫోన్‌లో మాట్లాడుతూ అప్రమత్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ట్యాంకర్ల సమ్మె విరమణ

బడులు ఒంటి పూట.. ఐటీ ఇంటి బాట!

మురసు.. ముంచెత్తింది

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 05 , 2026 | 04:57 AM