Share News

మురసు.. ముంచెత్తింది

ABN , Publish Date - Nov 05 , 2026 | 04:51 AM

మురసు తుపాను ఉమ్మడి ఖమ్మం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. బుధవారం ఉదయం నుంచి భద్రాద్రి జిల్లాలో సగటున 3.4 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా.. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా అశ్వారావుపేట మండలంలో 27.85 సెంమీ వర్షపాతం నమోదైంది.

మురసు.. ముంచెత్తింది

  • ఉమ్మడి ఖమ్మం జిల్లాపై తీవ్ర ప్రభావం..

  • రాష్ట్రంలోనే అత్యధికంగా అశ్వారావుపేటలో 27.8 సెం.మీ వర్షపాతం

  • గ్రామాల మధ్య నిలిచిన రాకపోకలు

  • వరి, పత్తి పంటలకు తీవ్రనష్టం

ఖమ్మం/కొత్తగూడెం/హైదరాబాద్‌, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మురసు తుపాను ఉమ్మడి ఖమ్మం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. బుధవారం ఉదయం నుంచి భద్రాద్రి జిల్లాలో సగటున 3.4 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా.. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా అశ్వారావుపేట మండలంలో 27.85 సెంమీ వర్షపాతం నమోదైంది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు ములకలపల్లిలో 19.7 సెంమీ, దమ్మపేటలో 19.1, పాల్వంచలో 12 సెంమీ, కొత్తగూడెంలో 11.8 సెంమీ, చుంచుపల్లిలో 11.6, లక్ష్మీదేవిపల్లిలో 10.7, భద్రాచలంలో 10.4 సెంమీ వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లాలో 9.2 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా అత్యధికంగా పెనుబల్లిలో 22.5 సెం.మీ నమోదైంది. అశ్వారావుపేటలోని కాలనీలన్నీ జలమయమయ్యాయి. గుర్రాలచెరువు రోడ్‌, భద్రాచలం రోడ్‌, సత్తుపల్లి, రాజమండ్రి వెళ్లే జాతీయ రహదారులపై నాలుగు అడుగుల మేర వరదనీరు ప్రవహించింది. దీంతో రాజమండ్రి రహదారిపై రెండు గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.


Untitled-1 copy.jpgదొంతికుంట చెరువుకు వరదనీరు అధికంగా రావటంతో పరిస్థితి తీవ్రతను గుర్తించిన అధికారులు చెరువుకు గండి పెట్టి నీటిని వదిలారు. అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి మండలాల్లో 1,500 ఎకరాల్లో వరి, 1,600 ఎకరాల్లో మినుము పంట దెబ్బతిన్నట్టు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఖమ్మం జిల్లాలో సుమారు 25 వేల ఎకరాల్లో వరి, 50 వేల ఎకరాల్లో పత్తి, మరో 5 వేల ఎకరాల్లో ఇతర పంటలు మొత్తం 80 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు ప్రాథమిక అంచనా. ములకలపల్లి మండలం మూకమామిడి ప్రాజెక్టు వాగులో మిరయాల మధు అనే రైతు చిక్కుకుపోయి చెట్టుపైకి ఎక్కాడు. అధికారులు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం సహాయంతో ఒడ్డుకు చేర్చారు. దమ్మపేట మండలం మల్లెపూల వాగులో నాగమణి అనే మహిళ చిక్కుకుపోవడంతో మంత్రి తుమ్మల కలెక్టర్‌తో మాట్లాడి రెస్క్యూ టీం ద్వారా రక్షించారు.


పెదవాగు ప్రాజెక్టు రింగ్‌బండ్‌కు గండి...

అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి గ్రామ సమీపంలోని పెదవాగు ప్రాజెక్టుకు మరోసారి గండి పడింది. ప్రాజెక్టు వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రింగ్‌బండ్‌ కొట్టుకుపోయింది. దీంతో రూ. కోట్ల నిధుల నీటిపాలవగా అన్నదాతలకు సాగునీటికి కష్టాలు ఎదురయ్యే పరిస్థితి ఏర్పడింది. వెరసీ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 165 మండలాల్లో వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం రాష్ట్రంలోని పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, రంగారెడ్డి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ జిల్లాలకు యెల్లో అలెర్ట్‌ జారీ చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ట్యాంకర్ల సమ్మె విరమణ

బడులు ఒంటి పూట.. ఐటీ ఇంటి బాట!

రైతుభరోసా పేరిట నకిలీ ఎస్‌ఎంఎస్‌లు!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 05 , 2026 | 04:51 AM