రైతుభరోసా పేరిట నకిలీ ఎస్‌ఎంఎస్‌లు!
ABN , Publish Date - Nov 05 , 2026 | 04:23 AM
‘‘తెలంగాణ రైతాంగానికి నమస్కారం. రైతుభరోసా కింద ప్రతి సంవత్సరం ఎకరాకు ఇచ్చే మొత్తాన్ని రూ. 12 వేలకు పెంచాం. తదనుగుణంగా మీ బ్యాంకు ఖాతాలో రూ. 7,500 జమయ్యాయి.. మీ సీఎం రేవంత్ రెడ్డి’’ అంటూ బుధవారం తెల్లవారుజామున వరంగల్ జిల్లా చెన్నారావుపేటలోని ఒక రైతుకు ముఖ్యమంత్రి పేరుతో ఓ టెక్స్ట్ మెసేజ్ వచ్చింది.
సీఎం పేరుతో 2.73 లక్షల మంది రైతులకు మెసేజ్‌లు
బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు సందేశాలు
తమకు సంబంధం లేదని వ్యవసాయశాఖ ప్రకటన
హైదరాబాద్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ‘‘తెలంగాణ రైతాంగానికి నమస్కారం. రైతుభరోసా కింద ప్రతి సంవత్సరం ఎకరాకు ఇచ్చే మొత్తాన్ని రూ. 12 వేలకు పెంచాం. తదనుగుణంగా మీ బ్యాంకు ఖాతాలో రూ. 7,500 జమయ్యాయి.. మీ సీఎం రేవంత్ రెడ్డి’’ అంటూ బుధవారం తెల్లవారుజామున వరంగల్ జిల్లా చెన్నారావుపేటలోని ఒక రైతుకు ముఖ్యమంత్రి పేరుతో ఓ టెక్స్ట్ మెసేజ్ వచ్చింది. దీంతో తన ఖాతాలో డబ్బులు పడ్డాయేమోనని తనిఖీ చేసుకోగా నయాపైసా జమ కాలేదు. సాయంత్రం వరకు వేచి చూసి ఏఈవోను ఆరా తీయగా.. రైతుభరోసాపై ప్రభుత్వం నుంచి తమకెలాంటి ఆదేశాలు రాలేదని చెప్పడంతో సదరు రైతు మిన్నకుండిపోయారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2,73,128 మంది రైతులకు ఇదే తరహా సందేశాలు రావడంతో.. ‘‘మెసేజ్‌లు వచ్చాయి.. డబ్బులు రాలేదు’’ అని రైతులు ఆందోళనకు గురయ్యారు. రైతు భరోసా పథకంపై ముఖ్యమంత్రి పేరిట నకిలీ ఎస్ఎంఎస్‌లు వెళ్లడంతో అన్నదాతలు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు, సమాచారం వెలువడక ముందే ఏకంగా రెండు లక్షలకు పైగా రైతుల ఫోన్లకు ఒకేసారి సందేశాలు రావడం తీవ్ర కలకలం రేపింది.
సైబర్ విచారణకు డీజీపీకి లేఖ
ఈ ఆకస్మిక మెసేజ్‌ల వ్యవహారంపై స్పందించిన వ్యవసాయశాఖ, తాము ఎవరికీ ఎలాంటి సందేశాలు పంపలేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో సందేశాల మూలం, వాటిని పంపిన వ్యక్తులు లేదా ఏజెన్సీలు, సంస్థలను గుర్తించడానికి సైబర్ క్రైమ్ విభాగంతో సమగ్ర విచారణ జరిపించాలని ఆ శాఖ డైరెక్టర్ బి. గోపి, డీజీపి సీవీ ఆనంద్‌కు బుధవారం లేఖ రాశారు. రైతులకు అధికారికంగా సమాచారం పంపించేందుకు ‘‘సీడాక్’’ (సి-డీఏసీ) ఎస్‌ఎంఎస్ సర్వీస్ పోర్టల్‌ను వ్యవసాయశాఖ వినియోగిస్తోందని, అయితే ప్రస్తుతం రైతులకు చేరిన సందేశాల తరహాలో ఎలాంటి మెసేజ్‌లు పంపలేదని వివరించారు. సీడాక్ పోర్టల్‌తో పాటు వ్యవసాయశాఖ పేరును దుర్వినియోగం చేస్తూ అనధికారికంగా ఈ సందేశాలను పంపినట్లు అనుమానం వ్యక్తం చేశారు. సందేశాలు పంపిన గేట్‌వే, ఎస్‌ఎమ్మెస్ సెండర్ ఐడీ, ట్రాన్స్‌మిషన్ లాగ్స్ వంటి సాంకేతిక వివరాలను సేకరించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి చర్యల వల్ల శాఖ విశ్వసనీయతతో పాటు పథకం ప్రతిష్ఠ దెబ్బతినే ప్రమాదం ఉన్నదని వ్యవసాయ శాఖ పేర్కొంది. ఈ వ్యవహారాన్ని అత్యవసరంగా పరిగణించి విచారణ ప్రారంభించాలని డీజీపీని కోరింది.
ఈ వార్తలు కూడా చదవండి..
శబరిమలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News