ట్యాంకర్ల సమ్మె విరమణ
ABN , Publish Date - Nov 05 , 2026 | 04:34 AM
హైదరాబాద్‌లో ప్రైవేట్ నీటి ట్యాంకర్ల యజమానులు సమ్మె విరమించారు. నీటి సరఫరాను వెంటనే పునరుద్ధరించేందుకు అంగీకరించారు.
ప్రైవేటు ట్యాంకర్ల యజమానులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చర్చలు
ట్యాంకర్లు నిలిచిపోవడంతో ఆగమాగమైన మహానగరం
హైదరాబాద్ సిటీ/హైదర్‌నగర్/రాయదుర్గం/బర్కత్‌పుర, నవంబరు4 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో ప్రైవేట్ నీటి ట్యాంకర్ల యజమానులు సమ్మె విరమించారు. నీటి సరఫరాను వెంటనే పునరుద్ధరించేందుకు అంగీకరించారు. ఎల్‌నినో ప్రభావంతో నగరంలో నీటి ఎద్దడి నేపథ్యంలో కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ(క్యూర్) ఆవలి ప్రాంతం ప్యూర్ (పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ) నుంచే నీటిని తీసుకొచ్చి సరఫరా చేయాలన్న ప్రభుత్వ షరతుకు వారు అంగీకరించారని హైడ్రా పేర్కొంది. ఈ షరతుతో పాటు సంబంధిత విభాగాల అనుమతిని తప్పనిసరి చేయడం, సున్నం చెరువు, తమ్మిడికుంట, ఫాక్స్ సాగర్ తదితర ప్రాంతాల్లో అక్రమ బోర్లను తొలగించి నీటి దందాకు హైడ్రా చెక్ పెట్టిన నేపథ్యంలో ప్రైవేట్ ట్యాంకర్ల ఆపరేటర్లు మంగళవారం సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. ట్యాంకర్లు నిలిచిపోవడంతో నగరంలో నీటికి కటకట ఏర్పడింది. విద్యా సంస్థలు, హాస్టళ్లు, హోటళ్లు, ఆస్పత్రుల్లో నీళ్లు లేక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది.
మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన మేరకు ప్రైవేట్ ట్యాంకర్ల అసోసియేషన్ నాయకులు బుధవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌తో బుద్ధభవన్‌లో సమావేశమయ్యారు. సమస్యలపై చర్చించిన అనంతరం రంగనాథ్ సూచన మేరకు సమ్మె విరమణకు అంగీకరించారు. రాత్రి నుంచి ట్యాంకర్లు తిరగడం మొదలైందని అధికారులు తెలిపారు. అయితే అప్పటివరకు కొన్ని గంటల పాటు ట్యాంకర్లతో నీటి సరఫరా లేకపోవడంతో ఐటీ కారిడార్‌లోని పలు కార్పొరేట్ కళాశాలలు సెలవు ప్రకటించి విద్యార్థులను ఇళ్లకు పంపేశాయి. ప్రైవేట్ హాస్టళ్లు కూడా తాత్కాలికంగా మూతపడే పరిస్థితి నెలకొంది. హాస్టళ్లలోని విద్యార్థులకు కాలకృత్యాలకు కూడా నీరు కరువైంది. హాస్టళ్ల నిర్వహకులు ఎస్‌ఆర్ నగర్‌లోని వాటర్ బోర్డు జీఎం కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లలోనూ ఇబ్బందులు తలెత్తాయి. మరోవైపు, ట్యాంకర్ల యజమానుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ట్యాంకర్లను ఎక్కడికక్కడ నిలిపివేశారు. ఔటర్ రింగ్ రోడ్డు సహా పలు ప్రాంతాల్లో రోడ్డెక్కిన ట్యాంకర్లను అడ్డుకున్నారు. కొత్వాల్‌గూడ నుంచి నీరు తీసుకొస్తున్న ట్యాంకర్‌ను కొందరు వ్యక్తులు అడ్డగించారు. డ్రైవర్‌ను బెదిరించి.. ట్యాంకర్‌లోని పది వేల లీటర్ల నీటిని వృధాగా వదిలేశారు. కూకట్‌పల్లిలో ఓ ట్యాంకర్ డ్రైవర్‌పై కొందరు దాడిచేసి గాయపర్చారు.
నివాస ప్రాంతాల మధ్య భారీ బోర్లు తవ్వి..
నివాస ప్రాంతాల మధ్య వేల మీటర్ల లోతు బోర్లు వేసి పెద్దఎత్తున నీటిని తోడేస్తుండడంతో పరిసర ప్రాంతాల్లో ఇళ్లలోని బోర్లు వట్టిపోయాయి. దీనిపై స్థానికులు పెద్దఎత్తున హైడ్రాకు ఫిర్యాదులు చేశారు. దీంతో మాదాపూర్ తదితర ప్రాంతాల్లో ఇళ్లలోని అక్రమ బోర్లను తొలగించారు. ఇళ్లలో బోర్లు 100 నుంచి 500 అడుగుల మేర ఉంటాయని, వాణిజ్య అవసరాల కోసం 1,000 నుంచి 1,500 అడుగులు, అంతకంటే ఎక్కువ లోతు బోర్లు వేయడంతో ఇళ్లలోని బోర్లు ఎండిపోతున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయని రంగనాథ్ ట్యాంకర్ల యజమానులకు సూచించారు. భూగర్భ జలాలను వాణిజ్య అవసరాలకు వినియోగించకుండా నియంత్రించేందుకు వాటర్ బోర్డు, రెవెన్యూ, పోలీస్ తదితర విభాగాలతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు.
బోర్‌వెల్ నిబంధనలను సవరించాలి
బోర్‌వెల్ తవ్వకాల నిబంధనలను క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా సవరించాలని రిగ్ ఓనర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. భూగర్బ జలమట్టాలు తగ్గుతున్న నేపథ్యంలో బోర్‌వెల్ తవ్వకాల గరిష్ఠ లోతును 120 మీటర్ల నుంచి 300 మీటర్లకు పెంచాలని కోరింది.
నీటి సరఫరా ప్రారంభించాం
బుధవారం సాయంత్రం నుంచి మళ్లీ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా ప్రారంభమైంది. మేం ఎదుర్కొంటున్న సమస్యలలను మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్, శ్రీహరి దృష్టికి తీసుకెళ్లాం. సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని పొన్నం చెప్పారు. నివాస ప్రాంతాలకు దూరంగా బోర్లు వేసి నీటి సరఫరా చేయాలని హైడ్రా కమిషనర్ సూచించారు.
- చంద్రశేఖర్‌రెడ్డి,
సైబరాబాద్ వాటర్ ట్యాంకర్ల అసోసియేషన్ అధ్యక్షుడు
ఈ వార్తలు కూడా చదవండి..
శబరిమలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
రైతుభరోసా పేరిట నకిలీ ఎస్‌ఎంఎస్‌లు!
Read Latest Telangana News And AP News And National News
And Telugu News