స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు ఇక సులువుగా ఫైర్ ఎన్వోసీ!
ABN , Publish Date - Nov 05 , 2026 | 05:07 AM
పాఠశాలలు, జూనియర్ కాలేజీ భవనాల్లో చేపట్టే అగ్నిమాపక (ఫైర్ సేఫ్టీ) చర్యలకు సంబంధించి ఎన్వోసీ జారీకి విధించే నిబంధనల్ని అగ్నిమాపక శాఖ సరళీకరించింది.
నిబంధనల్ని సరళీకరించిన అగ్నిమాపక శాఖ
భవనాల వర్గీకరణకు అనుగుణంగా నిబంధనలు
నిర్మాణాలకు తగ్గట్లు ఫైర్‌సేఫ్టీ చర్యలు ఉండాలి
పాత భవనాలకు సెట్‌బ్యాక్ లేకున్నా ఎన్వోసీ
10 నుంచి వచ్చే దరఖాస్తులకు నూతన విధానం
హైదరాబాద్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): పాఠశాలలు, జూనియర్ కాలేజీ భవనాల్లో చేపట్టే అగ్నిమాపక (ఫైర్ సేఫ్టీ) చర్యలకు సంబంధించి ఎన్వోసీ జారీకి విధించే నిబంధనల్ని అగ్నిమాపక శాఖ సరళీకరించింది. అన్ని భవనాలకు ఒకే రకంగా కాకుండా.. ఆయా భవనాల ఎత్తు, నిర్మాణ స్వరూపాన్ని బట్టి చేపట్టాల్సిన అగ్నిమాపక చర్యలను నిర్దేశించింది. ఇటీవల పాఠశాలలు, జూనియర్ కాలేజీల ఫైర్ ఎన్వోసీల విషయంలో వివాదం రేగడంతో ఈ నిర్ణయం తీసుకుంది. తాము ఫైర్ ఎన్వోసీకి దరఖాస్తు పెట్టుకున్నామని, అయినా ఎన్వోసీ రాలేదని కాలేజీ యాజమాన్యాలు తెలిపాయి. దీంతో అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్‌సింగ్ మాన్, ఇతర ఉన్నతాధికారులు పాఠశాల, జూనియర్ కాలేజీ యాజమాన్యాలతో సమావేశమై అనేక అంశాలపై చర్చించిన అనంతరం నిబంధనల్ని సరళీకరించారు.
పాత భవనాలకు మినహాయింపులు..
ముఖ్యంగా పాత విద్యాసంస్థల భవనాల్లో నిర్దేశిత ఖాళీ స్థలాలు, అదనపు మెట్ల మార్గాల ఏర్పాటు విషయంలో ఎదురవుతున్న సమస్యలను అగ్నిమాపక శాఖ పరిశీలించి.. నిబంధనల్ని సవరించింది. వీటి ప్రకారం.. విద్యాసంస్థల ప్రాంగణాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాలను పరిగణనలోకి తీసుకుంటారు. అదనపు ఖాళీ స్థలాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని కోరరు. నిర్దేశిత సెట్బ్యాక్లు తక్కువగా ఉన్న సందర్భాల్లో.. పక్కనే రహదారి లేని వైపులలో అగ్నివ్యాప్తిని నిరోధించేందుకు ప్రత్యామ్నాయ చర్యగా వాటర్ కర్టెయిన్లు(సన్నటి నీటి ధారలు వచ్చేలా నీటి తెరలు) ఏర్పాటు చేయాలి. నాలుగు వైపుల నుంచి అగ్నిమాపక నీటిని అందించే ఫైర్ బ్రిగేడ్ ఇన్‌లెట్‌ను ఏర్పాటు చేయాలి. అదనపు ఖాళీ స్థలాలను సృష్టించడం సాధ్యం కాని భవనాల్లో ఈ చర్యలు అగ్నిప్రమాద నివారణను బలోపేతం చేస్తాయి.
భవనాల ఎత్తు, నిర్మాణ స్వరూపాన్ని బట్టి అవసరమైన అగ్నిమాపక, ప్రాణరక్షణ చర్యలను నిర్దేశించారు. అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేయడంతోపాటు మెట్ల మార్గాలు, కారిడార్లు, బయటకు వెళ్లే ద్వారాలు, అత్యవసర మార్గాల్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలి. ప్రమాదం జరిగిన సమయంలో బయటకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన అత్యవసర ద్వారం సులువుగా తెరుచుకునేలా ఉండాలి. అత్యవసర లైటింగ్, చీకటిలోనూ కనిపించే ఎగ్జిట్ సూచికలను ఏర్పాటు చేయాలి. అగ్నిమాపక నీటి నిల్వలను నిరంతరం అందుబాటులో ఉంచాలి. అత్యవసర తరలింపు ప్రణాళికలు, ఎమర్జెన్సీ ఫోన్ నంబర్లు, అగ్నిమాపక సూచనలను ప్రముఖ ప్రదేశాల్లో ప్రదర్శించాలి. నిర్దేశించిన విధంగా పాఠశాల భద్రతా సలహా కమిటీలు, పాఠశాల అగ్నిమాపక కార్యాచరణ బృందాలను ఏర్పాటు చేయాలి. అత్యవసర స్పందన ప్రణాళికలు, అగ్నిమాపక పుస్తకాలు రూపొందించాలి. సిబ్బందికి శిక్షణ, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. విద్యుత్ భద్రత, పరికరాల క్రమబద్ధమైన నిర్వహణ, ప్రథమ చికిత్స సదుపాయాలు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సంసిద్ధతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
స్వీయ ధ్రువీకరణ విధానం కొనసాగింపు..
ఫైర్ ఎన్వోసీ కోసం దరఖాస్తు చేసుకునే ముందు విద్యాసంస్థల యాజమాన్యాలు అన్ని నిబంధనలు పాటించాలి. ప్రస్తుతం అమల్లో ఉన్న స్వీయ ధ్రువీకరణ విధానాన్ని నిబంధనలు, షరతులకు అనుగుణంగా విద్యాసంస్థలు కొనసాగించవచ్చు. అగ్నిమాపక శాఖ ఎన్వోసీ అవసరమైన విద్యాసంస్థల దరఖాస్తులను కొత్త మార్గదర్శకాలు, నిర్దేశిత పత్రాలు, భద్రతా షరతుల ప్రకారం పరిశీలిస్తారు. గడువు ముగియడానికి రెండు నెలల ముందే యాజమాన్యాలు నిర్దేశిత విధానంలో, వర్తించే రుసుము చెల్లించి పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ సవరించిన మార్గదర్శకాలు ఈ నెల 10 నుంచి అందే ఎన్వోసీ దరఖాస్తులకు అమల్లోకి వస్తాయి. ఈ చర్యల వల్ల ఇప్పటికే ఉన్న విద్యాసంస్థలు భవన నిర్మాణ సంబంధిత వాస్తవిక ఇబ్బందులను అధిగమించి, అగ్నిమాపక నిబంధనలను పాటించే వీలు కల్పించడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అగ్నిమాపక, ప్రాణరక్షణ చర్యల సంసిద్థతను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్‌సింగ్ మాన్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మత్స్యకారులను కాపాడబోయి.. వరద నీటిలో సహాయక సిబ్బంది గల్లంతు
బడులు ఒంటి పూట.. ఐటీ ఇంటి బాట!
Read Latest Telangana News And AP News And National News
And Telugu News