ఆపరేషన్ చేయూత ప్రభావం.. లొంగిపోయిన కీలక మావోయిస్టు
ABN , Publish Date - Feb 17 , 2026 | 06:10 PM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిషేధిత మావోయిస్టు సంస్థకు చెందిన కీలక సభ్యుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, సీఆర్‌పీఎఫ్ అధికారుల సమక్షంలో లొంగిపోవడంతో అతడికి ప్రభుత్వ సహాయాన్ని అందజేశారు.
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి17 (ఆంధ్రజ్యోతి): నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు)కు చెందిన బీజాపూర్ ఏరియా కమిటీ సభ్యుడు తాటి మూక అలియాస్ చూటి (25) పోలీసుల ఎదుట లొంగిపోయాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ 81, 141 బెటాలియన్ అధికారుల సమక్షంలో అతను అధికారికంగా సరెండర్ అయ్యాడు. లొంగిపోయిన మావోయిస్టుకు ప్రభుత్వం తక్షణ సహాయం కింద రూ.25,000 ఆర్థిక సహాయం అందజేసింది. ప్రభుత్వ పునరావాస విధానంలో భాగంగా లొంగిపోయే మావోయిస్టులకు ఆర్థిక సహాయం, పునరావాసం, ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతోంది.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ చేయూత’ కార్యక్రమం ప్రభావంతో మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు. జనవరి నుంచి ఇప్పటివరకు వివిధ హోదాలకు చెందిన మొత్తం 359 మంది మావోయిస్టు సభ్యులు లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా మావోయిస్టులను హింస మార్గం నుంచి దూరం చేసి, సమాజంలో సాధారణ జీవితం గడపడానికి ప్రభుత్వం సహాయం అందిస్తోంది. పోలీసుల చర్యలు, ప్రభుత్వ పునరావాస విధానాల వల్ల మావోయిస్టు కార్యకలాపాలు తగ్గుముఖం పడుతున్నాయని అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మాజీ మంత్రి ఎర్రబెల్లి భావోద్వేగం. ఎందుకంటే..
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రద్దు: హైకోర్టు స్టేతో మారిన సమీకరణాలు
Read Latest Telangana News And AP News And Telugu News