‘స్మార్ట్’గా ఖమ్మం మిర్చి మార్కెట్
ABN , Publish Date - Nov 24 , 2026 | 04:01 AM
ఖమ్మం మార్కెట్‌లో ఎండకు ఎండి... వానకు తడిసి మిర్చి నాణ్యత దెబ్బతినే కష్టాలకు ఇక తెర పడనుంది.
రూ.155 కోట్లతో అత్యాధునిక యార్డు నిర్మాణం
డిసెంబరు 9న సీఎం రేవంత్‌రెడ్డితో ప్రారంభానికి సన్నాహాలు
ఖమ్మం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఖమ్మం మార్కెట్‌లో ఎండకు ఎండి... వానకు తడిసి మిర్చి నాణ్యత దెబ్బతినే కష్టాలకు ఇక తెర పడనుంది. రూ.155 కోట్లతో రాష్ట్రానికే మోడల్‌గా నిర్మిస్తున్న ‘స్మార్ట్ మిర్చి మార్కెట్’ పనులు చివరి దశకు వస్తున్నాయి. డిసెంబరు 9న ఖమ్మం పర్యటనకు వచ్చే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఈ మార్కెట్‌ను ప్రారంభింపజేసేందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సన్నాహాలు చేస్తున్నారు. ఆ తేదీకల్లా పనులు పూర్తి చేయాలని ఆయన ఇప్పటికే నిర్మాణ సంస్థను ఆదేశించారు. 15 ఎకరాల్లో.. రెండు దశల్లో ఈ మార్కెట్‌ని నిర్మిస్తున్నారు. గతేడాది ఫిబ్రవరి 26న పనులు మొదలయ్యాయి. మొదటి దశ కోసం రూ.114 కోట్లు కేటాయించారు.
ఈ దశలో షెడ్లు, ఫ్లోరింగ్, కార్యాలయ భవనం కడుతున్నారు. కమీషన్ ఏజెంట్లు, కార్మికులు, రైతుల కోసం విశ్రాంతి భవనం కూడా అందుబాటులోకి వస్తోంది. మూడు ఆర్వో వాటర్ ప్లాంట్లు, మూడు టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఏడు షెడ్లలో ఆరు పూర్తయ్యాయి. మిగిలింది నెలాఖరుకు పూర్తవుతుంది. ఒక్కో షెడ్డు 121 మీటర్ల పొడవు, 27 మీటర్ల వెడల్పు ఉంటుంది. అన్ని షెడ్లలో కలిపి రెండు లక్షల బస్తాలు నిల్వ చేయవచ్చు. వర్షాలు, తుపాన్లు, గాలి దుమారాల వల్ల రైతులు తెచ్చుకున్న సరుకుకు నష్టం వాటిల్లకుండా పూర్తి భద్రత కలుగుతుంది. అగ్నిప్రమాదాల నివారణకు ప్రత్యేకంగా నీటి నిల్వ సంప్, పైపులైన్లు ఏర్పాటు చేశారు. ఏటా సీజన్లో 50 నుంచి 80 వేల బస్తాలు అమ్మకానికి వస్తుంటాయి. మొత్తంగా రూ.వేల కోట్ల విక్రయాలు జరుగుతాయి. వీటి ద్వారా ఈ మార్కెట్‌కు ఏటా రూ.25 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. గత ఎన్నికలవేళ ఇచ్చిన హామీ మేరకు మంత్రి తుమ్మల ఈ మార్కెట్‌ను ఆధునికీకరిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి: పవన్ కల్యాణ్
వైసీపీకి మిగిలేది కక్షలు, అప్పులే.. సోమిరెడ్డి సెటైర్లు
ఏపీలో మేయర్లు, ఛైర్‌పర్సన్ల ప్రమాణ స్వీకారానికి వేళాయే..
Read Latest AP News And Telangana News And National News
And Telugu News