‘సింగరేణి’లో డేటా సెంటర్లు!
ABN , Publish Date - Nov 11 , 2026 | 06:06 AM
నల్లబంగారంతో పారిశ్రామిక ప్రగతికి బాటలు వేస్తున్న సింగరేణి.. భవిష్యత్తులో సాంకేతిక విప్లవానికీ కేంద్రంగా మారే దిశగా అడుగులు వేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం భారీగా పెరుగుతుండడంతో డేటా సెంటర్లకు డిమాండ్ పెరిగిపోతోంది.
గోదావరి లోయపై అమెరికా సంస్థల ఆసక్తి..
డేటా సెంటర్ల ఏర్పాటుపై చర్చలు
మూతపడిన ఓసీపీల్లో పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్లాంట్లు
గోదావరి జలాలు.. విద్యుత్ అనుకూలతలుగా గుర్తింపు
ఖనిజ సంపదపైనా అంతర్జాతీయ భాగస్వామ్యానికి యత్నాలు
గోదావరిఖని, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): నల్లబంగారంతో పారిశ్రామిక ప్రగతికి బాటలు వేస్తున్న సింగరేణి.. భవిష్యత్తులో సాంకేతిక విప్లవానికీ కేంద్రంగా మారే దిశగా అడుగులు వేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం భారీగా పెరుగుతుండడంతో డేటా సెంటర్లకు డిమాండ్ పెరిగిపోతోంది. ఈ క్రమంలో విద్యుత్, నీరు, స్థలం లాంటి వసతులు ఒకే చోట అందుబాటులో ఉన్న సింగరేణి పరిధిలోని కొన్ని స్థలాలు డేటా సెంటర్ల ఏర్పాటుకు అనువుగా ఉంటాయన్న ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో ఈ నెల 6న సంస్థ సీఎండీ బుద్ధప్రకాష్ జ్యోతితో అమెరికా కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందం సమావేశమైంది. కీలక ఖనిజాలు, పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టులు, డేటా సెంటర్ల ఏర్పాటుపై చర్చించింది.
తెలంగాణలో డేటా సెంటర్ల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను పరిశీలిస్తున్నామని, సింగరేణి ప్రాంతంపై ఆసక్తి ఉందని అమెరికా ప్రతినిధులు వెల్లడించారు. ఈ సందర్భంగా సింగరేణి అధికారులు తమ భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. మూసివేసిన ఓపెన్‌కా్‌స్ట ప్రాజెక్టు (ఓసీపీ)లను ఉపయోగించుకుని పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రామగుండంలో మూతపడిన మేడిపల్లి ఓసీపీలో 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుత్ కేంద్రం ఏర్పాటు దిశగా కార్యాచరణ చేస్తున్నట్లు తెలిపారు. సుమారు ఆరు ఓసీపీలు పంప్డ్ స్టోరేజీ ప్లాంట్ల ఏర్పాటుకు క్రమంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ప్లాంట్లతో పీక్‌అవర్స్‌లో విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు డేటా సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయవచ్చని వివరించారు. సమీపంలోనే గోదావరి నది ఉండడం మరో అనుకూలతగా అధికారులు పేర్కొన్నారు.
కృత్రిమ మేధకు డేటా సెంటర్లే కీలకం
బ్యాంకింగ్, విద్య, వైద్యం, రక్షణ, పారిశ్రామిక, ప్రభుత్వ సేవలు.. ఇలా ప్రతి రంగంలోనూ ఏఐ వినియోగం పెరుగుతోంది. ఆయా రంగాల్లోని కార్యకలాపాలన్నింటికీ డేటా సెంటర్లే కీలకం. వేల సంఖ్యలో సర్వర్లు, అత్యంత వేగవంతమైన నెట్‌వర్క్ వ్యవస్థలు కలిగిన జీపీయూ చిప్‌లు ఒకే ప్రాంగణంలో పని చేస్తుంటాయి. ఏఐ ఆధారిత డేటా సెంటర్లలో విద్యుత్ వినియోగం అధికంగా ఉంటుంది. అంతర్జాతీయ ఇంధన సంస్థ అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్ల విద్యుత్ వినియోగం 2030 నాటికి 950 టెరావాట్ల అవర్లకు చేరవచ్చని అంచనా.
గోదావరి జలాలు మరో అనుకూలత..
డేటా సెంటర్ల నిర్వహణలో విద్యుత్‌తో పాటు నీరు కీలకం. భారీ కంప్యూటర్ సర్వర్లు పని చేసే సమయంలో ఉత్పత్తయ్యే వేడిని నియంత్రించేందుకు శీతలీకరణ వ్యవస్థలు అవసరమవుతాయి. కొన్ని డేటా సెంటర్లలో చిల్లర్ వ్యవస్థలు, కూలింగ్ టవర్లు, లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని వినియోగిస్తారు. ఇందుకు సింగరేణి ప్రాంతానికి సమీపంలో గోదావరి నది ప్రవహిస్తుండడం ఒక అనుకూలత. పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులకు, పారిశ్రామిక అవసరాలకు నీటిని వినియోగించుకునే అవకాశాలను సింగరేణి అధికారులు అమెరికా ప్రతినిధులకు వివరించారు.
అంతర్జాతీయ పెట్టుబడులకు అవకాశం
కీలక ఖనిజాల అన్వేషణ, వెలికితీతపైనా సమావేశంలో చర్చించారు. సింగరేణి కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన జియో సైన్స్ ల్యాబొరేటరీపై అమెరికా ప్రతినిధులు ఆసక్తి చూపారు. ఓసీపీల్లో బొగ్గు తీసే క్రమంలో వచ్చే మట్టిలో విలువైన ఖనిజాలు, అరుదైన భూ మూలకాలు ఉన్నాయనే విషయంపై చర్చించారు. ఈవీల మోటార్లు, విండ్ టర్బైన్లు, ఎలకా్ట్రనిక్ పరికరాలు, రక్షణ రంగానికి అవసరమైన సాంకేతిక ఉత్పత్తుల్లో ఈ ఖనిజాలకు ప్రాధాన్యం ఉంది. ఈ రంగాల్లో అమెరికా సంస్థలతో భాగస్వామ్యానికి సింగరేణి ఆసక్తి చూపుతోంది. 2027 ఏప్రిల్‌లో అమెరికాలో జరగనున్న కీలక ఖనిజాల సదస్సుకు హాజరు కావాలని అమెరికా ప్రతినిధి బృందం సింగరేణికి ఆహ్వానం పలికింది.
ఈ వార్తలు కూడా చదవండి.
విద్యాసంస్థల్లో సినిమా కార్యక్రమాలు నిషేధం!
రొమ్ము నుంచి ఇతర అవయవాలకు క్యాన్సర్!
ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News