రైస్ మిల్లర్ల ఆటకు ఇక బ్రేక్..
ABN , Publish Date - Sep 30 , 2026 | 10:18 AM
రైస్ మిల్లుల్లో ధాన్యం, బియ్యం నిల్వల మాయాజాలానికి ఇక బ్రేక్ పడనుంది.
స్టాక్ సర్దుబాటుకు ఇక చాన్స్ లేదు
ధాన్యం నుంచి సీఎంఆర్ దాకా.. డిజిటల్ నిఘా
అందుబాటులోకి పీవీ యాప్
జమ్మికుంట(కరీంనగర్): రైస్ మిల్లుల్లో ధాన్యం, బియ్యం నిల్వల మాయాజాలానికి ఇక బ్రేక్ పడనుంది. ధాన్యం కేటాయింపు నుంచి మిల్లింగ్, బియ్యం, నిల్వలు, సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) సరఫరా వరకు ప్రతి దశను పర్యవేక్షించేందుకు పౌరసరఫరాల శాఖ ఫిజికల్ వెరిఫికేషన్ (పీవీ) యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై జమ్మి కుంట పరిధిలోని రైస్ మిల్లుల్లోనూ ప్రతి బుధవారం ర్యాండమైజేషన్ విధానంలో ఆకస్మిక భౌతిక తనిఖీలు నిర్వహించే అవకాశం ఉంది. దీంతో రికార్డుల్లో ఉన్న నిల్వలు, మిల్లుల్లో వాస్తవంగా ఉన్న నిల్వలను అధికారులు అక్కడికక్కడే పోల్చిచూడనున్నారు.
గతంలో మిల్లులో తనిఖీలకు వెళ్లే విషయం ముందుగానే తెలిసే అవకాశం ఉండడంతో నిల్వలను సర్దుబాటు చేసుకు నేదుకు మిల్లర్లకు వెసులుబాటు ఉండేదన్న విమర్శలు ఉన్నాయి. కొత్త విధానంలో ఈ అవకాశానికి అడ్డుకట్ట వేసేలా ర్యాండమైజేషన్ అమలు చేస్తున్నారు. ఏ మి ల్లును ఏ అధికారి తనిఖీ చేయాలన్నది ముందుగా నిర్ణ యించకుండా యాప్ ద్వారానే కేటాయిస్తారు. తనిఖీకి వెళ్లే అధికారికి సైతం మిల్లు వివరాలు సుమారు 12 గంటల ముందు మాత్రమే ఎస్‌ఎంఎస్ ద్వారా అంద నున్నాయి. దీంతో ఆకస్మిక తనిఖీలకు మరింత ప్రాధాన్యం ఏర్పడనుంది.
రికార్డు లెక్కలు.. వాస్తవ నిల్వలు
మిల్లుకు ఎంత ధాన్యం కేటాయించారు.. ఎంత మిల్లింగ్ చేశారు.. ప్రభుత్వానికి ఎంత సీఎంఆర్ అందించారు.. ఎంత స్టాక్ ఉండాలి.. ఎంత పెం డింగ్‌లో ఉంది.. ప్రస్తుతం మిల్లులో ఎంత నిల్వ ఉంది .. వంటి వివరాలు పీవీ యాప్‌లో అందు బాటులో ఉంటాయి. క్షేత్రస్థాయి అధికారి మిల్లు వద్దకు వెళ్లినప్పుడు యాప్‌లోని వివరాలను అక్కడి భౌతిక నిల్వలతో సరిపోల్చుతారు. తేడాలు కనిపిస్తే వాటిని యాప్‌లోనే నమోదు చేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నారు.
జమ్మి కుంట ప్రాంతంలో గత సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ సరఫరా, మిల్లుల్లో మిగిలి ఉన్న ప్రభుత్వ ధాన్యం, బియ్యం నిల్వలు వంటి అంశాలపై ఈ తనిఖీలతో స్పష్టత వచ్చే అవ కాశం ఉంది. ముఖ్యంగా సీఎంఆర్ సరఫరాలో ఆలస్యం చేస్తున్న మిల్లులపై పర్యవేక్షణ పెరగ నుంది. మిల్లింగ్ పురోగతి, పెండింగ్ స్టాక్, ప్రభు త్వానికి అందాల్సిన బియ్యం, సరఫరా గడువు వంటి వివరాలను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించనున్నారు.
అధికారుల పనితీరుపై నిఘా..
పీవీ యాప్ మిల్లర్ల లెక్కల పరిశీలనకే పరిమితం కాకుండా తనిఖీలు నిర్వహించే అధికారుల పనితీరును పర్యవేక్షించేందుకు కూడా ఉపయోగపడనుంది. క్షేత్ర స్థాయిలో అధికారులు నమోదు చేసిన వివరాలను జిల్లాస్థాయి ఉన్నతాధికారులు పరిశీలించే అవకాశం ఉంటుంది. భౌతికంగా చూసిన స్టాక్, యాప్‌లో నమో దైన వివరాల మధ్య తేడా ఉంటే ఆ విషయం డిజిటల్ రికార్డులో స్పష్టంగా కనిపించనుంది.
ప్రతి బుధవారం పీవీ యాప్ ఆధారంగా భౌతిక తనిఖీలు నిర్వహించే విధానం కొనసాగనుంది. ఏ మిల్లుకు ఎవరు వెళ్లాల న్నది ర్యాండమైజేషన్ ద్వారా నిర్ణయించనున్నారు. తనిఖీ వివరాలు, స్టాక్ పరిస్థితి, సీఎంఆర్ పెండింగ్, లోటుపాట్లు తదితర అంశాలను యాప్‌లోనే నమోదు చేయనున్నారు. దీంతో ధాన్యం నుంచి బియ్యం వరకు ప్రతి క్వింటాకు లెక్క ఉండేలా డిజిటల్ పర్యవేక్షణ వ్యవస్థ మరింత పటిష్టం కానుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
రికార్డు స్థాయిలో పడిపోతున్న బంగారం ధరలు
శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు.. శిలాతోరణం వరకు క్యూలైన్
Read Latest AP News And Telangana News And International News And Telugu News