భారత దళాలకు చిక్కిన పాకిస్థానీలు.. రూ.3 వేల కోట్ల డ్రగ్స్ సీజ్
ABN , Publish Date - Sep 30 , 2026 | 09:06 AM
ఇటీవల భారత కోస్టు గార్డు దళాలకు భారీ స్థాయిలో మాదకద్రవ్యాలు చిక్కాయి. సెప్టెంబర్ 25న అరేబియా సముద్రం మీదుగా పడవలో రూ.3 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను తరలిస్తూ ఐదుగురు పాకిస్థానీలు చిక్కారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల భారత కోస్టు గార్డు దళాలకు భారీ స్థాయిలో మాదకద్రవ్యాలు చిక్కాయి. సెప్టెంబర్ 25న అరేబియా సముద్రం మీదుగా పడవలో రూ.3 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను అక్రమంగా తరలిస్తూ ఐదుగురు పాకిస్థానీలు చిక్కినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ఆధారంగా నిందితులపై నిఘా పెట్టిన కోస్టు గార్డు దళం వారిని అదుపులోకి తీసుకుంది. గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళంతో కలిసి ఈ సంయుక్త ఆపరేషన్ నిర్వహించింది. లక్షద్వీప్‌కు పశ్చిమాన పడవను కోస్టు గార్డు అధికారులు సీజ్ చేశారు.
గగనతలం, సముద్రంపై గట్టి నిఘా పెట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నామని కోస్టు గార్డు తెలిపింది. అనుమానాస్పద పడవను వెంబడించి అదుపులోకి తీసుకున్నామని పేర్కొంది. పడవలో హెరాయిన్, మెతాంఫిటమీన్ ఉన్నాయని తెలిపింది. వివిధ దేశాల్లో విస్తరించిన డ్రగ్స్ అక్రమ రవాణా నెట్‌వర్క్ కట్టడిలో భాగంగా కోస్టు గార్డు ఈ ఆపరేషన్ నిర్వహించింది. నిందితులను ముంబైకి తరలించింది.
డ్రగ్స్ అక్రమ రవాణా కట్టడికి ఇటీవల కాలంలో భారత భద్రతా దళాలు గట్టి చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సముద్ర మార్గం ద్వారా మాదకద్రవ్యాల అక్రమరవాణాకు అడ్డుకట్ట వేసేందుకు వెయ్యి కళ్లతో నిఘా పెడుతున్నాయి. గతేడాది ఏప్రిల్‌లో కూడా కోస్టు గార్డు గుజరాత్ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్‌తో కలిసి చేసిన ఓ ఆపరేషన్‌లో 307 కిలోల మాదకద్రవ్యాలను సీజ్ చేసింది.
ఈ వార్తలనూ చదవండి:
రేవంత్ వ్యాఖ్యలు హిందూ విశ్వాసాలపై దాడే
బీజేపీ పాలనలో ద్వితీయ శ్రేణి పౌరులుగా ఎస్సీ, ఎస్టీలు