Share News

రేవంత్‌ వ్యాఖ్యలు హిందూ విశ్వాసాలపై దాడే

ABN , Publish Date - Sep 30 , 2026 | 06:42 AM

‘‘శివుడు పేదల దేవుడు. రాముడు ధనికుల దేవుడు’’ అంటూ సోమవారం ఢిల్లీలో ఓ మీడియా సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విశ్వ హిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

రేవంత్‌ వ్యాఖ్యలు హిందూ విశ్వాసాలపై దాడే
Ram Shiva

  • దేవుళ్లను కూడా పేద, ధనిక అంటూ విభజిస్తారా?

  • రేవంత్‌ వ్యాఖ్యలపై ఆ పార్టీ హైకమాండ్‌ స్పందించాలి

  • వీహెచ్‌పీ అధికార ప్రతినిధి వినోద్‌ బన్సల్‌ డిమాండ్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 29: ‘‘శివుడు పేదల దేవుడు. రాముడు ధనికుల దేవుడు’’ అంటూ సోమవారం ఢిల్లీలో ఓ మీడియా సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విశ్వ హిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలను హిందూ విశ్వాసాలపైన చేసిన నీచమైన దాడిగా అభివర్ణించింది. హిందూ సమాజంలో విభజనలు తీసుకురావడానికి కాంగ్రెస్‌ పార్టీ చేయని ప్రయత్నం లేదని, ఆ పార్టీ ఇప్పుడు దేవుళ్లను కూడా విభజిస్తోందని వీహెచ్‌పీ అధికార ప్రతినిధి వినోద్‌ బన్సల్‌ అన్నారు.


‘‘కులం, జాతి, ప్రాంతం ఇలా ఎన్నో అంశాల ఆధారంగా హిందువుల మధ్య విభజన తెచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ 76ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. ఇప్పుడు హిందూ దేవుళ్ల మధ్య కూడా విభజన తెస్తోంది’’ అని మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్‌ అంటేనే ముస్లిం.. ముస్లిం అంటే కాంగ్రెస్‌’’ అని వ్యాఖ్యానించారు. రేవంత్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ స్పందించాలని, ఆయన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్తారో.. లేదో స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Sep 30 , 2026 | 06:42 AM