బీజేపీ పాలనలో ద్వితీయ శ్రేణి పౌరులుగా ఎస్సీ, ఎస్టీలు
ABN , Publish Date - Sep 30 , 2026 | 05:58 AM
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు జరిగిన అవమానాన్ని నిరసిస్తూ... దళితులు, ఆదివాసీల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు దేశవ్యాప్తంగా ఐక్య పోరాటం చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.
ఖర్గే అంశం దళితులకు అవమానం
ఆత్మగౌరవం కోసం ఐక్యంగా పోరాడాలి
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
న్యూఢిల్లీ, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు జరిగిన అవమానాన్ని నిరసిస్తూ... దళితులు, ఆదివాసీల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు దేశవ్యాప్తంగా ఐక్య పోరాటం చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. మంగళవారం ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ఎంపీ మల్లు రవి నేతృత్వంలో కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ ఎంపీల ఫోరం ఆధ్వర్యంలో దళిత-ఆదివాసీ ఆత్మగౌరవ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు వివేక్ వెంకటస్వామి, సీతక్క, ఎంపీలు బల్‌రామ్ నాయక్, గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. మల్లికార్జున ఖర్గే దేశంలో అత్యున్నత పదవులను నిర్వహించిన నాయకుడని, అలాంటి నేత సభ అనంతరం హల్ద్వానీలో ‘శుద్ధీకరణ ’ చేయడం దళితుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని భట్టి పేర్కొన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే అస్పృశ్యతకు వ్యతిరేకంగా తొలి తీర్మానం ఆమోదించారని ఆయన గుర్తు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి రాజ్యాంగంపై నమ్మకం లేదనిని... మను ధర్మశాస్త్ర భావజాలాన్ని ప్రోత్సహించాలనే ఆలోచనతో ఆ పార్టీ వ్యవహరిస్తోందన్నారు. దళితులు, ఆదివాసీలపై వివక్షకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే పలు చట్టాలు తెచ్చామని చెప్పారు. ఖర్గేకు జరిగిన ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ రాహుల్ గాంధీ నిరసన చేపడితే... బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి ఆయనపైనే కేసు పెట్టారని భట్టి విమర్శించారు. ‘‘ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూసే పరిస్థితిని మనం అంగీకరించకూడదు. అందరం ఒక్కతాటిపైకి వచ్చి ఆత్మగౌరవం కోసం పోరాడాలి’’ అని పిలుపునిచ్చారు.