సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు.. బహిరంగసభలో సీఎం రేవంత్
ABN , Publish Date - Sep 30 , 2026 | 07:51 PM
సిరిసిల్లలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా మునుపటి ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు.
సిరిసిల్ల, సెప్టెంబర్ 30: గత ప్రభుత్వ పాలనలో సిరిసిల్ల ఉరిసిల్లగా మారిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ప్రాంతాన్ని బీఆర్ఎస్ నాయకులు సమస్యలకు నిలయంగా మార్చారని ఆయన ఆరోపించారు. సిరిసిల్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ ప్రసంగించారు. ఈ సందర్భంగా మునుపటి ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘ఇక్కడ చేనేత కళను నమ్ముకుని ఎన్నో కుటుంబాలు జీవిస్తున్నాయి. గత పాలకులు ఆ కుటుంబాలను పట్టించుకోలేదు’ అంటూ ధ్వజమెత్తారు. సిరిసిల్ల ప్రజల గురించి ఏనాడైనా కేటీఆర్ ఆలోచించారా..? అని ప్రశ్నించారు.
అలాగే బహిరంగ సభలో ప్రసంగిస్తూ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబాన్ని తీవ్రంగా విమర్శించారు. ఆ కుటుంబానికి లక్షల కోట్ల ఆస్తులెలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని వారు అన్ని ఆస్తులు సంపాదించారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ మొత్తాన్ని దోచుకుందని ఫైరయ్యారు. రాష్ట్ర ప్రజలను కేసీఆర్ పట్టించుకోలేదని విమర్శించారు. ‘గల్ఫ్‌లో తెలంగాణ కార్మికులు మరణిస్తే.. కనీసం మృతదేహాలను తెచ్చేందుకు కూడా బీఆర్ఎస్ సహకరించలేదు. గల్ఫ్ బాధితుల కష్టాలు వారికి పట్టవు’ అని రేవంత్ పేర్కొన్నారు. అసలు గల్ఫ్ వలసలను కేసీఆర్ ఎందుకు ఆపలేకపోయారని ఆయన నిలదీశారు.
సిరిసిల్లపై గురి
ఈ సందర్భంగా సిరిసిల్లలో కేటీఆర్ గడీలను నేలమట్టం చేస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఈ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ఆయన చెప్పారు. అలాగే బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబ సభ్యులకు పదవులు వచ్చాయని, తమ పాలనలో తెలంగాణ కోసం కొట్లాడినవారికి పదవులు ఇచ్చామని తెలిపారు.
ఈ వార్తలూ చదవండి
సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా ఉద్యోగులు పనిచేయాలి: సీఎం రేవంత్ రెడ్డి
‘సిరిసిల్లలో చేసిన అభివృద్ధిలో పదిశాతం చేయగలరా’.. సీఎం రేవంత్‌కు పాడి కౌశిక్ సవాల్