Metpalli Incident: చైనా మాంజా ప్రమాదం.. నాలుగేళ్ల చిన్నారికి తీవ్రగాయాలు..
ABN , Publish Date - Jan 09 , 2026 | 11:33 AM
సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో గాలిపటాల సందడి మొదలైంది. అయితే గాలిపటంతో ఆడుకునే సమయంలో చైనా మాంజాతో పలువురు గాయపడిన ఘటనలు ఇటీవల తరచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మెట్‌పల్లిలో చైనా మాంజా వల్ల గొంతు కోసుకుని నాలుగేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి..
జగిత్యాల జిల్లా, జనవరి9 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో గుండెలను పిండేసే ఘటన చోటుచేసుకుంది. నిషేధిత చైనా మాంజా (Chinese manjha incident) మరొకరిని తీవ్రంగా గాయపరిచింది. గాలిపటంతో ఆడుకుంటున్న ఓ చిన్నారి మెడకు.. మాంజా చుట్టుకోవడంతో గొంతు తెగి తీవ్ర రక్తస్రావమైంది. ప్రస్తుతం ఆ బాలుడు మృత్యువుతో పోరాడుతున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపడమే కాకుండా.. నిషేధిత మాంజా విక్రయాలపై ప్రజల్లో తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది.
దుబ్బవాడలో విషాదం..
మెట్‌పల్లి పట్టణంలోని దుబ్బవాడ ప్రాంతానికి చెందిన శ్రీహాస్ (4) అనే బాలుడు తన ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో చైనా మాంజా ఒక్కసారిగా గొంతుకు చుట్టుకుంది. మాంజాను తీయబోతుండగా గొంతు తెగి తీవ్ర రక్తస్రావమైంది. గొంతు భాగంలో తీవ్రమైన గాయమవడంతో చిన్నారి గట్టిగా కేకలు వేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు రక్తపు మడుగులో ఉన్న బాలుడిని చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆపై మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
విషమంగా ఆరోగ్యం..
నిజామాబాద్ ఆస్పత్రిలో బాలుడికి అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించారు. గొంతు భాగంలో లోతైన గాయం కావడంతో వైద్యులు దాదాపు 20 కుట్లు వేశారు. ప్రస్తుతం శ్రీహాస్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. బాలుడి పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ విషయం కుటుంబ సభ్యులు, స్థానికులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
చర్యలు తీసుకోవాలి..
మెట్‌పల్లిలో శ్రీహాస్ గాయపడిన ఘటన అందరినీ ఆలోచింపజేస్తోంది. పండుగ పూట ఇళ్లలో విషాదం నింపే ఇలాంటి చైనా మాంజాలను వెంటనే బహిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. పోలీసులు వెంటనే స్పందించి మెట్‌పల్లి, పరిసర ప్రాంతాల్లో చైనా మాంజా విక్రయాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజాసాబ్ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి..
మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
Read Latest Telangana News And Telugu News