పాలవ్యాపారం.. నెలకు లక్షన్నర ఆదాయం
ABN , Publish Date - Jun 13 , 2026 | 12:57 PM
పట్టుదలతో శ్రమిస్తే విజయం సాధించవచ్చని నిరూపించాడు కేశనపల్లికి చెందిన పెగుడ రాజేందర్.
రాజన్న డెయిరీ విజయ ప్రస్థానం
ప్రైవేట్ ఉద్యోగంలో ఒడిదొడుకులు
పట్టణం వదిలి పల్లెబాట
మరో ముగ్గురికి ఉపాధి కల్పిస్తున్న కేశనపల్లి యువకుడు
ముత్తారం(కరీంనగర్): పట్టుదలతో శ్రమిస్తే విజయం సాధించవచ్చని నిరూపించాడు కేశనపల్లికి చెందిన పెగుడ రాజేందర్. డిగ్రీ చదువు తున్న సమయంలోనే కరోనా మహమ్మారి రూపంలో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నిండింది. తండ్రి చంద్రయ్య అకాల మరణంతో కుటుంబ భారం రాజేందర్‌పై పడింది. అయినా ధైర్యం కోల్పోకుండా డిగ్రీ పూర్తి చేస్తూనే, భవిష్యత్తు కోసం మల్టీమీడియా (విజువల్ ఎఫెక్ట్) కోర్సు కూడా నేర్చుకున్నాడు.
హైదరాబాద్‌లో ప్రైవేట్ కంపెనీలో ఉపాధి పొందాడు. మార్కెట్లోకి వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావంతో మల్టీమీడియా రంగంలో మార్పులు వచ్చాయి. ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోవడాన్ని చూసిన రాజేందర్ తన కాళ్ళపై సొంతంగా నిలబడాలని నిర్ణయించుకున్నాడు. ఉద్యోగానికి స్వస్తి చెప్పి ఊరిబాట పట్టాడు. చుట్టుపక్కల వారు హేళన చేసినా వెనకడుగు వేయకుండా, కేవలం రెండు బర్రెలతో ప్రారంభించిన తన ప్రయాణాన్ని నేడు నెలకు లక్షన్నర రూపాయల ఆదాయం వచ్చే స్థాయికి తీసుకెళ్లాడు.

హేళనలను తట్టుకొని.. ఒంటరి పోరాటం
పట్టణంలో ఉద్యోగం వదిలేసి, ఊరొచ్చి పశువుల పోషణ చేపట్టిన రాజేందర్‌ను చుట్టుపక్కల వారు, బంధువులు హేళన చేశారు. చదువుకుని, ఉద్యోగం చేసుకోక ఇక్కడికొచ్చి బర్రెలు కాసుకుంటున్నావా అంటూ ఎగతాళి చేశారు. ఆ మాటలు మానసిక బాధను కలిగించినా వాటన్నింటినీ దిగమింగాడు. కుటుంబం అందించిన మద్దతుతో రెండు బర్రెలతో పాల వ్యాపారాన్ని ప్రారంభించాడు.

రాజన్న డెయిరీ ఫార్మ్. సగర్వ ప్రస్థానం!
ఆధునిక యాజమాన్య పద్ధతులు పాటిస్తూ రాజేందర్ డెయిరీని విస్తరించాడు. ప్రస్తుతం 20 పశువుల స్థాయికి చేరింది. నాణ్యమైన పాలను అం దిస్తూ వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకున్నాడు. ప్రస్తుతం సొంత గ్రామంలోనే రాజన్న డెయిరీ ఫార్మ్ పేరిట విజయవంతంగా నడుపుతూ.. అన్ని ఖర్చులు పోను నెలకు లక్షన్నర అర్జిస్తున్నాడు. అంతే కాదు, గ్రామానికి చెందిన ముగ్గురికి ఉపాధి కల్పించాడు. కేవలం పట్టుదల, శ్రమ నమ్ముకుని స్వయం ఉపాధితో సాధించిన పెగడ రాజేందర్ యాదవ్ నేటి తరం నిరుద్యోగ యువతకు ఒక ఆదర్శం.
ఉద్యోగాలు లేవని నిరాశపడొద్దు...
పెగడ రాజేందర్
నగరాలకు వలస వెళ్లి చిన్న ఉద్యోగాలు చేసే కంటే.. సొంత ఊరిలోనే ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అవమానాలను పట్టించుకోకుండా కష్టపడితే, కచ్చితంగా విజయం సాధించవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఈ విజయాలు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి మరో గొప్ప మైలురాయి
Read Latest AP News And Telangana News And International News And Telugu News