ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కారుపై బీజేపీ నేతల దాడి.. కరీంనగర్‌లో ఉద్రిక్తత
ABN , Publish Date - May 07 , 2026 | 12:23 PM
కరీంనగర్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్‌తో పాటు పాడి కౌశిక్ రెడ్డి కారును బీజేపీ నేతలు ధ్వంసం చేశారు.
కరీంనగర్, మే 7: ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై బీజేపీ నేతలు దాడి చేశారు. అలాగే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కారుపై దాడి చేయడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో కరీంనగర్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసన బీజేపీ నేతలు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
ఈరోజు(గురువారం) ఉదయం కరీంనగర్‌లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్‌మీట్ నిర్వహించి.. కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై పలు వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందంటూ ఆరోపణలు గుప్పించారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై బండి సంజయ్ అనుచరులు, బీజేపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కౌశిక్ రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టిన కమలాకర్ క్యాంపు కార్యాలయంపై దాడి చేశారు. బీజేపీ శ్రేణుల దాడిలో కార్యాలయం అద్దాలు, పూల కుండీలు ధ్వంసమయ్యాయి. అక్కడే ఉన్న కౌశిక్ రెడ్డి కారుపై దాడి చేసి అద్దాలను పూర్తిగా ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. బీజేపీ శ్రేణులను చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ నేతల దాడులతో కరీంనగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కరీంనగర్ నుంచి జగిత్యాలకు వెళ్లే జాతీయ రహదారిని మూసివేసిన పోలీసులు.. వేరే మార్గంలో వాహనాలను మళ్లిస్తున్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.
సిరిసిల్లలో హైటెన్షన్..
మరోవైపు సిరిసిల్లలో బండి సంజయ్ పర్యటనపై హైటెన్షన్ నెలకొంది. కేటీఆర్‌పై బండి సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. కేంద్ర మంత్రి పర్యటనను అడ్డుకునేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమయ్యారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. పలువురు బీఆర్‌ఎస్ శ్రేణులను ముందుస్తుగా అరెస్ట్ చేశారు. భారీగా పోలీసులు మోహరించారు.
ఇవి కూడా చదవండి...
భూ వివాదాల్లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేస్తాం: మంత్రి అనగాని సత్యప్రసాద్
కేటీఆర్‌ను విమర్శించే స్థాయి బండి సంజయ్‌కి లేదు: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
Read Latest Telangana News And Telugu News