ఇక హద్దులు పక్కాగా..
ABN , Publish Date - Aug 04 , 2026 | 12:25 PM
నిజాం కాలంలో చేసిన సర్వేను ప్రమాణికంగా తీసు కుని ఇప్పటి వరకు భూముల సరిహద్దులు నిర్ణయిస్తున్నారు.
గ్రామాల్లో భూ భారతి రీసర్వే
భూ వివాదాలకు తెరపడే అవకాశం
జమ్మికుంట(కరీంనగర్): నిజాం కాలంలో చేసిన సర్వేను ప్రమాణికంగా తీసు కుని ఇప్పటి వరకు భూముల సరిహద్దులు నిర్ణయిస్తున్నారు. సాధారణంగా ప్రతి 30ఏళ్లకు ఒకసారి భూ సర్వే చేయాల్సి ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు దానిని నిర్లక్ష్యం చేశాయి. దీంతో ప్రభుత్వ భూములు సైతం కబ్జా కావడంతోపాటు సరిహద్దు వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు భూభారతి రీసర్వే ప్రక్రియను అత్యాధునికమైన డీజీపీఎస్ (డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషన్ సిస్టమ్) విధానం ద్వారా నిర్వహిస్తోంది. ఈ సర్వేకు భూ భారతి పోర్టల్ ద్వారా జీపీఎస్ వెరిఫైడ్ ల్యాండ్ మ్యాపింగ్ సాంకే తికతను ఉపయోగిస్తున్నారు. ఉపగ్రహ ఆధారిత అక్షాంశాలు, రేఖాంశాలు ద్వారా భూమి సరిహద్దులను డిజిటల్‌గా లాక్ చేస్తారు. దీనివల్ల ఒకరి భూమిని మరొకరు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉండదు.
గట్టు పంచాయతీలకు తెర
గ్రామాల్లో ప్రధాన సమస్యలైన గెట్లు జరపడం, ఒకరి భూమిని మరొకరు ఆక్రమించుకోవడం, ప్రభుత్వ భూమిని కబ్జా చేసి, సంక్షేమ పథకాలను దొడ్డిదారిన పొందుతున్నటువంటి వారికి ఈ భూ భారతి చట్టం ద్వారా చెక్ పడనుంది. సాగు భూ ముల రిజిస్ట్రేషన్లలో సరిహద్దు మ్యాప్‌లను అను సంధానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ప్రతి పట్టాదారుకు భూధార్ అనే పేరుతో ఒక నంబర్‌ను కేటాయించి, వారికి సంబంధించిన పూర్తి భూమి వివరాలు అందులో పొందుప రుచుతారు.
క్యూ ఆర్ కోడ్‌ను కేటాయించి, ఎల్‌పీఎమ్ విధానం (ల్యాండ్ పార్సిల్ మ్యాప్) ద్వారా రైతులకు సంబంధించిన పూర్తి వివరాలను క్రోడీకరించ నున్నారు. రెవెన్యూ రికార్డులు, క్షేత్రస్థాయి సరిహ ద్దులు ఒకేలా ఉండేలా చూసి వివాద రహిత భూ మిగా గుర్తిసారు. రాష్ట్రవ్యాప్తాంగా రీ-సర్వే పూర్తయిన తర్వాత ప్రతి భూమికి ఒక ప్రత్యేక భూధార్ నంబర్‌ను కేటాయిస్తున్నారు. మనిషికి ఆధార్ కార్డు ఎలాగో, భూమికి ఈ భూధార్ కార్డు అలా పనిచేస్తుంది. ఇందులో భూమి విస్తీర్ణం, సరిహద్దుల మ్యాప్ డిజిటల్‌గా లింక్ అయి ఉంటాయి.

పైలట్ ప్రాజెక్ట్‌గా విలాసాగర్ !
ప్రతీ మండలంలోని ఒక్కో గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంచుకున్న ప్రభుత్వం.. ఆయా గ్రామాల్లో భూభారతి ద్వారా భూముల సర్వేను చేస్తోంది. జిల్లాలోని జమ్మికుంట మండలంలో విలాసాగర్ గ్రామం ప్రభుత్వం ఎంచుకున్న పైలట్ ప్రాజెక్ట్‌ల్లో ఒకటి. విలాసాగర్‌లో మొత్తం 386 సర్వే నెంబర్లు ఉండగా, అందులో 1,423 ఎకరాల 24 గుంటల భూమి ఉంది. 15 సర్వే నంబర్లలో 139 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. 371 సర్వే నంబర్లలో 492 మంది రైతులకు సంబంధించిన 951 ఎకరాల భూమి ఉంది. మిగిలిన 333 ఎకరాల భూమి మానేరు వాగులో భాగంగా అధికారులు తేల్చారు.
ఇక ఇబ్బందులు ఉండవు
వేల్పుల సదయ్య, రైతు
మా తాత ముత్తాతల కాలం నుంచి మాకిచ్చిన భూములకు సంబంధించిన సరిహద్దుల్లో తరుచుగా పొరుగు వారితో గొడవలు జరుగుతుండేవి. ఎన్నోసార్లు భూ వివాదాలకు సంబంధించిన పంచాయతీలు జరిగాయి. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకువచ్చిన భూ భారతి డిజిటలైజేషన్ విధానం వల్ల మా భూముల లెక్కలు పక్కాగా తేలుతాయని భావిస్తున్నాం. సరిహద్దుల విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవని నమ్ముతున్నాం.
సరిహద్దు వివాదాలకు చెక్..
గడ్డం సుధాకర్, తహసీల్దార్
గ్రామీణ ప్రాంతాల్లోని భూములకు సంబంధించి, గతంలో సరిహద్దు వివాదాలు ఎక్కువగా జరిగేవి. ప్రతి నిత్యం భూమికి సంబంధించిన సమస్యల కోసం తహసీల్దార్ కార్యాలయానికి రైతులు ఎక్కువగా వచ్చేవారు. ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న భూ భారతి రీ సర్వే వల్ల భూముల లెక్కలు కచ్చితంగా తేలడంతో పాటు సరిహద్దు వివాదాలకు తెరపడనుంది. ప్రస్తుతం విలాసాగర్ గ్రామంలో భూమి సరిహద్దుల లెక్కలపై అధికారులు కొలతలు వేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
అన్నదాతకు వరం.. పీఎం కిసాన్ మాన్‌ధన్
హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో 5న తాగునీటి సరఫరా బంద్
Read Latest AP News And Telangana News And International News And Telugu News