రాష్ట్రానికి వర్ష సూచన.. వారంరోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు
ABN , Publish Date - Sep 20 , 2026 | 03:16 PM
వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్రానికి చల్లని కబురు చెప్పింది. వారం రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో మండుటెండలతో అల్లాడుతున్న ప్రజలకు ఊరట లభించనుంది.
హైదరాబాద్, సెప్టెంబర్ 20: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడే అవకాశం ఉన్నందున తెలంగాణలో ఈరోజు(ఆదివారం) నుంచి వారం రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్రంలోని 24 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది.
ఈరోజు గంటకు 40-50 కి. మీ వేగంతో రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలులు వీస్తాయని.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
రేపు(సోమవారం)రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు వెల్లడించారు.
వాయుగుండంగా మారే అవకాశం..
ప్రస్తుతం అల్పపీడనం ఉత్తర అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇది సెప్టెంబర్ 21న వాయుగుండంగా, 22న తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 23 ఉదయం నాటికి దక్షిణ ఒడిశా–ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలకు సమీపంలోని పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతానికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో 20, 21, 22, 23, 24, 25వ తేదీల్లో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
కేసీఆర్ కుటుంబ సభ్యుల భూముల విచారణపై కట్టుబడి ఉన్నాం: మహేశ్ గౌడ్
రోడ్ల విస్తరణకు ఇరిగేషన్ అధికారులు ఎందుకు అడ్డం పడుతున్నారు: ఎంపీ రఘునందన్ రావు
హైదరాబాద్‌లో పోలీసుల భారీ ఆపరేషన్.. 425 కేజీల గంజాయి స్వాధీనం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News