Share News

ధరణితోనే అనేక భూ సమస్యలు.. గత ప్రభుత్వంపై వీహెచ్ ఫైర్

ABN , Publish Date - Aug 26 , 2026 | 01:18 PM

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రభుత్వ సలహాదారుడు వి.హనుమంతరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గాంధీభవన్‌లో ప్రజలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో వీహెచ్ పాల్గొన్నారు.

ధరణితోనే అనేక భూ సమస్యలు.. గత ప్రభుత్వంపై వీహెచ్ ఫైర్
V Hanumantha Rao

హైదరాబాద్, ఆగస్టు 26: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రభుత్వ సలహాదారుడు వి.హనుమంతరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈరోజు(బుధవారం) గాంధీభవన్‌లో ప్రజలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో వీహెచ్ పాల్గొన్నారు. ప్రజలు, కార్యకర్తల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ప్రగతి భవన్‌ను కట్టి ప్రజల సమస్యలను చెప్పుకోవడానికి అవకాశాలు ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రగతి భవన్‌ను ప్రజా భవ‌న్‌గా మార్చి ప్రజా సమస్యల పరిష్కార కేంద్రంగా మార్చారని తెలిపారు. గాంధీభవన్ కూడా ప్రజల సమస్యల పరిష్కార వేదిక అయ్యేలా ముఖాముఖీ కార్యక్రమం చేపట్టారని చెప్పారు.


ఆ భూములపై అక్రమ రిజిస్ట్రేషన్లు

ఈరోజు ముఖాముఖి కార్యక్రమంలో.. భూములకు సంబంధించిన సమస్యలే ఎక్కువగా తన దృష్టికి వచ్చినట్లు వీహెచ్ తెలిపారు. పటేల్ పట్వారి విధానం వల్ల భూ సమస్యలు తక్కువగా ఉండేవన్నారు. గత ప్రభుత్వం.. ధరణితో పాటు అనేక సమస్యలు తీసుకొచ్చిందని వ్యాఖ్యానించారు. నాడు ఇందిరా గాంధీ పంచిన భూములను మళ్లీ భూస్వాములు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని తెలిపారు. రిజిస్ట్రేషన్ ఆఫీసులో తప్పిదాలు జరుగుతున్నాయని.. రెవెన్యూ శాఖ మంత్రి పటిష్ట చర్యలు తీసుకోవాలని వి.హనుమంతరావు సూచించారు.


వన్ నేషన్ వన్ ఎలక్షన్‌కు వ్యతిరేకం..
వన్ నేషన్ వన్ ఎలక్షన్‌తో నరేంద్ర మోదీ నాలుగోసారి ప్రధాని అవ్వాలని చూస్తున్నారని వీహెచ్ అన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమెరికాలో సాధ్యమని.. భారత దేశంలో కాదన్నారు. ప్రధాని మోదీకి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు సంబంధాలు ఉన్నాయని.. అందుకే భారత్‌ను అమెరికాలా చేయాలని మోదీ చూస్తున్నారని అన్నారు. భారత్ సెక్యులర్ దేశమని.. ఇక్కడ వన్ నేషన్ వన్ ఎలక్షన్ సాధ్యం కాదని చెప్పారు. భారత దేశంలో భిన్న మతాలు, భిన్న కులాల ఉన్నాయన్నారు. కేంద్రం చేస్తున్న క్యాస్ట్ సెన్స్, కులగణనలో బీసీల కాలమే లేదని తెలిపారు. అలాంటిది వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎక్కడిదని ప్రశ్నించారు. 70 శాతం ఉన్న బీసీలకు అన్యాయం చేస్తారా అంటూ నిలదీశారు. ముందు బీసీల సంగతి తేల్చాలన్నారు. ‘మేము వన్ నేషన్ వన్ ఎలక్షన్‌కు వ్యతిరేకం’ అని స్పష్టం చేశారు. కులగణన పేరుతో ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఉన్న ఓట్లకు, ఈసీ లెక్కలకు తేడా ఉందని వీహెచ్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని చూస్తే ఊరుకోం: భాను ప్రకాశ్ రెడ్డి

రేపు యువతతో ప్రధాని సంభాషణ.. ‘ఖేలో ఇండియా డైలాగ్‌’లో పాల్గొననున్న మోదీ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 26 , 2026 | 01:27 PM