పుట్టినరోజు నాడైనా కేటీఆర్ నిజాలు మాట్లాడాలి: మహేష్ గౌడ్
ABN , Publish Date - Jul 24 , 2026 | 04:14 PM
పుట్టినరోజు నాడైనా కేటీఆర్ నిజాలు మాట్లాడాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. నల్ల చొక్కాలు వేసుకున్నంత మాత్రాన ప్రజలు నమ్మరన్నారు.
హైదరాబాద్, జులై 24: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు నాడైనా కేటీఆర్ నిజాలు మాట్లాడాలని సూచించారు. ఈరోజు(శుక్రవారం) మీడియాతో మాట్లాడుతూ.. నల్ల చొక్కాలు వేసుకున్నంత మాత్రాన ప్రజలు నమ్మరన్నారు. కపట ప్రేమలు, నల్లచొక్కా డ్రామాలు నడవవని చెప్పుకొచ్చారు. ‘రేవంత్ ఢిల్లీకి వెళ్తే ఏంటి? వెళ్లకపోతే ఏంటి?.. కొడంగల్‌లో నిరసన చేశారు’ అని అన్నారు. విద్యార్థుల ఉద్యమంపై కేసీఆర్ ఇప్పటిదాకా ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదని విమర్శించారు. కేసీఆర్ ఎత్తేసిన ధర్నా చౌక్‌లో కేటీఆర్ ధర్నా చేశారని.. ధర్నా చేసే హక్కు ఆయనకు ఎక్కడిదని ప్రశ్నించారు.
కేటీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాక ధర్నా చేస్తే బాగుంటుందని మహేష్ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో చనిపోయిన ప్రతి ఒక్కరికీ బీఆర్‌ఎస్ అకౌంట్ నుంచి రూ.2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 27 మంది విద్యార్థుల మరణానికి కారణం గ్లోబరీనా సంస్థ అని ఆరోపించారు. 2011లో జరిగిన గ్లోబరీనా అంశంలో నివేదిక ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. ‘గ్లోబరీనాపై విచారణకు కేటీఆర్ ఫిర్యాదు చేయాలి. మాకు మేముగా విచారణ చేస్తే కక్ష సాధింపు అంటారు’ అని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో పేపర్ లీక్‌లు అందరికీ తెలుసని అన్నారు. ఇసుక వ్యాపారంతో ఎంతోమంది చావులకు కారణం కేటీఆర్ అని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వేర్వేరు కాదని.. రెండూ ఒకటే అనడానికి బలమైన కారణాలు ఉన్నాయని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
విద్యా వ్యవస్థకు ఉపాధ్యాయులే వెన్నెముక: సీఎం చంద్రబాబు
ఉద్యోగ, ఉపాధికి దగ్గరగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం: సీఎం రేవంత్ రెడ్డి
Read Latest Telangana News And Telugu News