ఉద్యోగ, ఉపాధికి దగ్గరగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం: సీఎం రేవంత్ రెడ్డి
ABN , Publish Date - Jul 24 , 2026 | 03:07 PM
క్యూర్ పరిధిలో చేపట్టనున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్, జులై 24: క్యూర్ పరిధిలో చేపట్టనున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు(శుక్రవారం) సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాలను వెంటనే గుర్తించి ఇళ్ల నిర్మాణానికి వినియోగించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఔటర్ రింగ్ రోడ్(ఓఆర్ఆర్) లోపల ఉన్న ఖాళీ ప్రభుత్వ భూములపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లోనే ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని పేర్కొన్నారు. పోలీస్, రెవెన్యూ, రవాణా శాఖల పరిధిలో ఖాళీగా ఉన్న స్థలాలను గృహ నిర్మాణం కోసం వినియోగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మొదటి విడతలో 17 నియోజకవర్గాల్లో మొత్తం 7,680 ఇందిరమ్మ ఫ్లాట్లను నిర్మించనున్నట్లు సీఎం వెల్లడించారు. 528 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం జరుగనుందన్నారు. ఒక్కో ఫ్లాట్ నిర్మాణానికి సుమారు రూ.11 లక్షల వ్యయం అవుతుందని, ఇందులో ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ అందిస్తుందని చెప్పారు. భూమి వ్యయాన్ని(ల్యాండ్ కాస్ట్) పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. ఖాళీ ప్రభుత్వ భూముల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నిరుపేదలకు నగరానికి చేరువలోనే గృహాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి...
జనసేనకు పత్రికలు, ఛానళ్లు లేవు.. కార్యకర్తలే మీడియా: మంత్రి నాదెండ్ల మనోహర్
విద్యా వ్యవస్థకు ఉపాధ్యాయులే వెన్నెముక: సీఎం చంద్రబాబు
Read Latest Telangana News And Telugu News