Share News

జనసేనకు పత్రికలు, ఛానళ్లు లేవు.. కార్యకర్తలే మీడియా: మంత్రి నాదెండ్ల మనోహర్

ABN , Publish Date - Jul 24 , 2026 | 01:11 PM

జనసేన పార్టీ బలోపేతం కోసం ఎంతోమంది ‌పని చేస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సాధారణ ఎన్నికలలో రాష్ట్ర హితం కోసం కూటమి ధర్మానికి కట్టుబడి అందరూ కలిసి పని చేశారని చెప్పారు.

జనసేనకు పత్రికలు, ఛానళ్లు లేవు.. కార్యకర్తలే  మీడియా: మంత్రి నాదెండ్ల మనోహర్
Nadendla Manohar

విజయవాడ, జులై 24: జనసేన పార్టీ బలోపేతం కోసం ఎంతోమంది ‌పని చేస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈరోజు(శుక్రవారం) విజయవాడలోని తూర్పు, సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాల జనసేన నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సాధారణ ఎన్నికల్లో రాష్ట్ర హితం కోసం కూటమి ధర్మానికి కట్టుబడి అందరూ కలిసి పని చేశారని చెప్పారు. అంతా కలిసి కట్టుగా ఉండటం వల్లే ఈ ప్రస్థానం కొనసాగిస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించి ఏపీకి అవసరమైన నిధులు ఇవ్వకుండా అన్యాయం చేశారని విమర్శించారు. పవన్ కల్యాణ్ పదవుల కోసం జనసేన ఏర్పాటు చేయలేదని.. యువతను, మహిళలను చైతన్యపరిచేలా జనసేన పార్టీ తొలి అడుగులు వేసిందన్నారు.


విజయవాడ నగరం ఉద్యమాల గడ్డ అని.. రాజకీయ చైతన్యానికి మరో‌పేరని మంత్రి అన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో విజయవాడ నాయకులకు‌ గుర్తింపు ఉండేదన్నారు. మూడు రాజధానులని వైసీపీ అధినేత జగన్ రెడ్డి ప్రకటిస్తే.. జనసేన ఉద్యమం చేసిందని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన పార్టీ జనసేన అని తెలిపారు. గత స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయడానికి చాలా మంది భయపడ్డారని.. జనసేనలో వీర మహిళలు, జన సైనికులు ధైర్యంగా నిలబడ్డారన్నారు. విజయవాడ కార్పొరేషన్‌లో 34 స్థానాల్లో నిలబడ్డారని.. క్షిష్ట పరిస్థితిని ఎదుర్కొని నిలబడిన తీరు ఆదర్శమని కొనియాడారు.


జనసేన.. ఏనాడు స్వార్థ రాజకీయాలను ప్రోత్సహించలేదని.. ఆ ఆలోచన కూడా చేయలేదని మంత్రి స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో పని చేసే వారిని గుర్తించి ప్రోత్సహిస్తామని అన్నారు. పార్టీలో ఉన్న కార్యకర్తల మాట నాయకులు వినాలని.. ప్రతి నియోజకవర్గంలో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎవరూ నోరు జారవద్దని, అనవసర రాద్దాంతాలు చేయవద్దని సూచించారు. జనసేనలో మరో గ్రూపు లేదని... ఎవరైనా పవన్ కల్యాణ్ గ్రూపే అని చెప్పుకొచ్చారు. ‘కూటమిలో మనం ఉన్నాం.. కలిసి‌కట్టుగా పని‌చేయాలి. అభిప్రాయబేధాలు ఉంటే కూర్చుని, చర్చించి పరిష్కరించుకోండి. జనసేన సభ్యత్వం నమోదులో కీలకంగా చాలా మంది పని చేశారు. జనవాణి ద్వారా ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నాం. అన్ని నియోజకవర్గాల్లో‌ జనవాణిని నిర్వహించాలి. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాన్ని బలంగా తిప్పి కొట్టాలి. మనకు పత్రికలు, ఛానళ్లు లేవు.. కార్యకర్తలే మన మీడియా. పవన్ ఆలోచనలు ప్రజల్లోకి తీసుకువెళ్లండి’ అంటూ పిలుపునిచ్చారు.


నేడు పంచాయతీ రాజ్ శాఖను దేశంలోనే రెండో స్థానంలో‌ పవన్ కల్యాణ్ నిలబెట్టారని మంత్రి తెలిపారు. విజయవాడలోని‌ 64 డివిజన్లలో జనసేన బలోపేతం కావాలన్నారు. కేవలం బీఫాం తెచ్చుకుని నిలబడితే గెలుపు రాదని.. కూటమిలో ఉన్నాం కాబట్టి అందరినీ కలుపుకుని వెళ్లాలని సూచించారు. ఎక్కడ జనసేన సీట్లు తీసుకోవాలి, ఎక్కడ పోటీ చేయాలనేది అధినేత పవన్ కల్యాణ్ అంతిమంగా నిర్ణయిస్తారన్నారు. అన్ని ప్రాంతాల్లో త్వరలోనే జనసేనాని కమిటీలను ప్రకటిస్తారన్నారు. గతంలో జనసేనకు వచ్చిన ఓట్లు, సీట్లను పరిశీలించి.. కొత్త ప్రణాళికతో ముందుకు సాగాలని నేతలకు మంత్రి నాదెండ్ల మనోహర్ నిర్దేశించారు.


ఇవి కూడా చదవండి...

విజయవాడ కార్పొరేషన్‌లో కూటమి పార్టీ విజయకేతనం ఎగురవేయాలి: మంత్రి కందుల దుర్గేశ్

గుడివాడ అంబేద్కర్ విగ్రహం వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 24 , 2026 | 01:30 PM