కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి.. విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలి: కేటీఆర్..
ABN , Publish Date - Jul 24 , 2026 | 01:53 PM
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. యువతపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని పేర్కొన్నారు.
హైదరాబాద్: ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా నిరసన చేపట్టిన విద్యార్థులపై జరిగిన దాడులు అమానుషమని కేటీఆర్ పేర్కొన్నారు. యువత జవాబుదారీతనం కోరుతోందని.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. యువతపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు విద్యార్థులకు సంఘీభావం తెలుపుతూ హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద కేటీఆర్ నిరసన దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా ఢిల్లీలో విద్యార్థులు, యువత పోరాటానికి బీఆర్‌ఎస్ తరఫున కేటీఆర్ సంఘీభావం ప్రకటించారు. 25 రోజులుగా ఢిల్లీలో పార్టీలకు అతీతంగా యువత పోరాడుతోందన్నారు. యువతపై జరుగుతున్న దాడులను దారుణమని తీవ్రంగా ఖండించారు. ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే ప్రధాని మోదీ పెట్టుకున్నారని.. ఈ జనరేషన్ చావుకు, ఐటీ, ఈడీ సోదాలకు భయపడేది కాదన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ.. మేక్ ఇన్ ఇండియా అడిగితే లీక్ ఇన్ ఇండియా ఇచ్చారంటూ సెటైర్లు వేశారు. న్యాయం చేయాలని విద్యార్థులు అడుగుతున్నారని, వారికి అండగా నిలబడతామని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీపై కొట్లాడితే చోటాభాయ్‌కు ఎందుకు కోపం వస్తుందో అర్థం కావడం లేదని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ చురకలు అంటించారు. మోదీ అంటే రేవంత్‌కు ఎందుకంత భయమంటూ ప్రశ్నించారు. పాత కేసులు తోడుతారని సీఎం భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.
ఢిల్లీలో మోదీ ఇంటి ముందు రాహుల్ గాంధీ ధర్నా చేస్తే రేవంత్ ఎక్కడ ఉన్నారని కేటీఆర్ ప్రశ్నించారు. నీట్ పేపర్ లీక్‌పై ఆయన ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నలు సంధించారు. విద్యార్థులను కొడుతుంటే సీఎం ఎందుకు మౌనంగా ఉన్నారన్నారు. పేపర్ లీక్‌కు తనకు సంబంధం ఏంటని, యూత్ కాంగ్రెస్ వాళ్లకు బుద్ధి ఉందా? అంటూ మండిపడ్డారు. వాళ్లు దేశంలో ఏం జరిగినా.. కేసీఆర్, కేటీఆర్‌దే తప్పు అంటున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డికి నిద్రలో కూడా కేసీఆరే గుర్తు వస్తున్నారని కేటీఆర్ చురకలు అంటించారు. నీట్ విద్యార్థులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
మాజీ మంత్రి కేటీఆర్‌కి కాంగ్రెస్ బర్త్‌డే గిఫ్ట్