దమ్ముంటే పార్లమెంటులో మాట్లాడండి.. రాహుల్ గాంధీకి పీవీఎన్ మాధవ్ సవాల్
ABN , Publish Date - Jul 24 , 2026 | 03:32 PM
యువత భవిష్యత్ పరమావధిగా ప్రధాని మోదీ పని చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యలో అనేక సంస్కరణలను ప్రధాని తీసుకువచ్చారని తెలిపారు.
విశాఖపట్నం, జులై 24: యువత భవిష్యత్ పరమావధిగా ప్రధాని మోదీ పని చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. ఈరోజు(శుక్రవారం) మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యలో అనేక సంస్కరణలను ప్రధాని తీసుకువచ్చారని తెలిపారు. IIT, IIM, గిరిజన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేశారని చెప్పారు. దేశంలో మెడికల్ సీట్లు పెంచారన్నారు. గత ప్రభుత్వంతో పోల్చితే.. ఈ ప్రభుత్వంలో లీకులు చాలా తక్కువ జరిగాయని చెప్పుకొచ్చారు.
నీట్‌లో లీకులు తెలిసిన వెంటనే చర్యలు తీసుకున్నారని మాధవ్ అన్నారు. నీట్ పేరుతో రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్నారని మండిపడ్డారు. నీట్ సాకు చూపి.. ప్రధాని, సుప్రీంకోర్టుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ప్రకాశ్ రాజ్ సహా కొందరు విద్రోహంగా, దేశ వ్యతిరేక మాటలు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసేందుకే ఈ విద్యా సంఘాలు ఉన్నాయని విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీకి దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన పేపర్ లీక్‌పై పార్లమెంట్‌లో మాట్లాడాలని సవాల్ విసిరారు. రాహుల్ గాంధీకి ధైర్యం లేక చర్చల్లో మాట్లాడడం లేదన్నారు.
ఆగస్టు 1న ప్రధాని మోదీ భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి వస్తున్నారని మాధవ్ చెప్పారు. ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో13 వేల మందితో థింసా నృత్యం, బొబ్బిలి వీణ నాదంతో ప్రధానికి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మూడు లక్షల మందితో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభమైన తరువాత ఉత్తరాంధ్రలో వెనకబడిన మండలం ఉండకూడదని సీఎం చంద్రబాబు ఆలోచనగా చెప్పుకొచ్చారు. ఉత్తరాంధ్రను మరింత అభివృద్ధి చేసేందుకు.. భోగాపురం విమాశ్రయం తీసుకొచ్చారని తెలిపారు. అల్లూరి పేరును చిరస్థాయిగా నిలిచిపోవడానికి ఆయన పేరు విమానాశ్రయానికి పెట్టినట్లు చెప్పారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయని పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
జనసేనకు పత్రికలు, ఛానళ్లు లేవు.. కార్యకర్తలే మీడియా: మంత్రి నాదెండ్ల మనోహర్
విద్యా వ్యవస్థకు ఉపాధ్యాయులే వెన్నెముక: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News