న్యూయార్క్‌లో తెలుగు యువకుడి దారుణ హత్య.. పిజ్జా డెలివరీ చేస్తుండగా కాల్పులు
ABN , Publish Date - Jun 06 , 2026 | 09:38 PM
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఓ తెలుగు యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న తెలుగు యువకుడు అన్షుల్ కుంచను గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపారు.
హైదరాబాద్, జూన్6 (ఆంధ్రజ్యోతి): అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఓ తెలుగు యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న తెలుగు యువకుడు కుంచ అన్షుల్‌ను గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అన్షుల్ న్యూయార్క్‌లో పిజ్జా డెలివరీ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నిన్న (శుక్రవారం) అర్థరాత్రి సమయంలో పిజ్జా డెలివరీ కోసం వెళ్లిన సమయంలో దుండగులు యువకుడిపై తుపాకీతో కాల్పులు జరిపారు.
నిన్న అర్థరాత్రి సుమారు 12 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అన్షుల్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడిది తెలంగాణలోని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా. గుండ్లపోచంపల్లిలోని ఎప్సీలోన్ వెంచర్ ప్రాంతంలో ఆయన కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు. అన్షుల్ మృతిచెందిన వార్త తెలిసిన వెంటనే కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై మృతుడి సోదరి తన్వి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన అన్న మృతదేహాన్ని త్వరగా భారత్‌కు తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని ఆమె కోరారు. అధికారులు సోమవారం నాటికి మృతదేహం భారత్‌కు చేరే అవకాశం ఉందని తెలిపారని అన్నారు.
అయితే అన్ని ప్రక్రియలను వేగవంతం చేసి తన అన్న భౌతికకాయాన్ని త్వరగా స్వదేశానికి తరలించేలా చర్యలు తీసుకోవాలని తన్వి విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై భారతీయ సంఘాలు, తెలుగు ప్రవాసులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో ఉన్న భారత రాయబార కార్యాలయం, సంబంధిత అధికారులు కుటుంబానికి అవసరమైన సహాయాన్ని అందించాలని కోరుతున్నారు. అన్షుల్ హత్యకు గల కారణాలపై న్యూయార్క్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది దోపిడీ ప్రయత్నమా..?, లేక ఇతర కారణాల వల్ల జరిగిందా..? అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మృతుడి కుటుంబానికి పలువురు ప్రజాప్రతినిధులు, స్థానికులు సానుభూతి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
రెండేళ్ల ప్రజా తీర్పు.. ఏపీ అభివృద్ధికి నాంది: చంద్రబాబు
పవన్ తెలంగాణకు వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలేదు: రాంచందర్ రావు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News