ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక కమిషన్
ABN , Publish Date - Nov 17 , 2026 | 03:38 AM
తమ సంక్షేమం కోసం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ట్రాన్స్‌జెండర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు జస్టిస్ ఆశామీనన్ కమిటీని కోరారు.
జస్టిస్ ఆశామీనన్ కమిటీకి ట్రాన్స్‌జెండర్ల వినతి
సంక్షేమం విషయంలో తెలంగాణ మెరుగు
మైత్రీ క్లినిక్స్ పేరిట వైద్య సేవలు ఆదర్శనీయం
ఇతర రాష్ట్రాల ట్రాన్స్‌జెండర్ల ప్రశంసలు
హైదరాబాద్ సిటీ, నవంబరు16 (ఆంధ్రజ్యోతి): తమ సంక్షేమం కోసం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ట్రాన్స్‌జెండర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు జస్టిస్ ఆశామీనన్ కమిటీని కోరారు. సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ ఆశా మీనన్ కమిటీ.. సోమవారం బేగంపేటలోని ప్లాజా హోటల్‌లో దక్షిణాది రాష్ట్రాల ట్రాన్స్‌జెండర్ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. తెలంగాణ, కేరళ, కర్ణాటక, గోవా రాష్ట్రాలకు చెందిన 200 మందికి పైగా ట్రాన్స్‌జెండర్లు హాజరై, తమ స్థితిగతులను వివరించారు. ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సంక్షేమానికి తెలంగాణలో మెరుగైన చర్యలు అమలవుతున్నాయని.. మైత్రీ క్లినిక్స్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న విధానం ఆదర్శనీయమని ట్రాన్స్‌జెండర్ల హక్కుల ఉద్యమకారులు పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్, మెట్రో, హైడ్రా లాంటి విభాగాల్లో ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగావకాశాలు కల్పించడాన్ని ఇతర రాష్ట్రాల ప్రతినిధులు కొనియాడారు. అయితే, తెలంగాణలోనూ మిగతా వారితో సమానంగా ట్రాన్స్‌జెండర్లకు అలవెన్సులు ఇవ్వడం లేదని.. ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకమేనని ఇక్కడి వారు చెప్పారు. ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల కోసం న్యాయ పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో 300మంది ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకుంటే ఒక్కరికి కూడా మంజూరు కాలేదని వివరించారు. కేరళలో ట్రాన్స్‌జెండర్ల హక్కులు సరిగ్గా అమలు కావడం లేదని ఆ రాష్ట్రానికి చెందిన వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ట్రాన్స్‌జెండర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తగిన సిఫారసులను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని ఆశామీనన్ కమిటీ హామీ ఇచ్చింది. ఈ సమావేశంలో తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, ట్రాన్స్‌జెండర్ ప్రొటెక్షన్ సెల్, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల
సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News