సీతమ్మసాగర్ బ్యారేజీ పనులను తిరిగి ప్రారంభించాలి
ABN , Publish Date - Nov 12 , 2026 | 04:40 AM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కీలకమైన సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టు పనులు ఎన్‌జీటీ కేసు కారణంగా నిలిచిపోయిన నేపథ్యంలో.. వాటిని తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని మంత్రి తుమ్మల కోరారు.
సీతారామ ఎత్తిపోతల పథకం పనులు వేగవంతం చేయాలి
నీటిపారుదల మంత్రి ఉత్తమ్‌తో మంత్రి తుమ్మల భేటీ
హైదరాబాద్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కీలకమైన సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టు పనులు ఎన్‌జీటీ కేసు కారణంగా నిలిచిపోయిన నేపథ్యంలో.. వాటిని తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని మంత్రి తుమ్మల కోరారు. పర్యావరణ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని, అవసరమైన క్లియరెన్సులు సాధించాలన్నారు. బుధవారం సచివాలయంలో మంత్రి ఉత్తమ్‌తో తుమ్మల సమావేశమై.. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి ఉన్న అవరోధాలను తొలగించడంపై చర్చించారు. సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన జూలూరుపాడు టన్నెల్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కోరారు. ఈ పథకం డిస్ర్టిబ్యూటరీ నెట్‌వర్క్‌లోని ప్యాకేజీలు 1, 2, 7, 8 పరిధిలో సంప్రదాయ గ్రావిటీ కాలువలకు బదులు ప్రెషరైజ్డ్ పైప్డ్ ఇరిగేషన్ నెట్‌వర్క్ విధానం అమలుకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు.
అశ్వారావుపేట నుంచి దబ్బతోగు, ఆసుపాక గ్రామాల్లోని చెరువులకు నీరందించే వెంకమ్మ చెరువు వరద కాలువ నిర్మాణ ప్రతిపాదనలకు ఆమోదంపైనా చర్చించారు. పెద్దవాగు మధ్యతరహా ప్రాజెక్టు వద్ద దెబ్బతిన్న కట్టకు శాశ్వత పునరుద్థరణ పనులు చేపట్టాలని కోరారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కింద సాగునీటి రిజర్వాయర్లపై, ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థతో కూడిన ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు ప్రతిపాదనలపైనా చర్చించారు. మరేళ్లపాడు ఎత్తిపోతల పథకం గ్రావిటీ కాలువలు, డిస్ర్టిబ్యూటరీ నెట్‌వర్క్ ప్రతిపాదనలు, బూర్గంపాడు మండలం వేపలగూడెం పరిధిలోని దోమలవాగు చిన్న నీటిపారుదల చెరువు సామర్థ్యాన్ని 0.48 టీఎంసీలకు పెంచే ప్రతిపాదనలకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. ఖమ్మం నియోజకవర్గంలోనూ సాగునీటి, వరద నివారణ, చెరువుల అభివృద్థికి సంబంధించి కీలక ప్రతిపాదనలను మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి తుమ్మల ప్రస్తావించిన అంశాలపై సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
ఆంధ్రకు నీళ్లు.. తెలంగాణకు ఎక్కిళ్లు
ప్రజాస్వామ్య పరిరక్షణకే భారత్ సమ్మిట్ 2.0
Read Latest Telangana News And AP News And National News
And Telugu News