Share News

పార్లమెంట్ సాక్షిగా తెలంగాణకు అవమానం జరిగింది: మంత్రి పొన్నం

ABN , Publish Date - Apr 16 , 2026 | 04:53 PM

పార్లమెంట్ వేదికగా డీలిమిటేషన్‌ బిల్లుపై ప్రసంగించిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రాన్ని అవమానించేలా మాట్లాడారంటూ అసభ్య పదజాలం వాడుతూ ఘాటుగా విమర్శించారు.

పార్లమెంట్ సాక్షిగా తెలంగాణకు అవమానం జరిగింది: మంత్రి పొన్నం
Ponnam Prabhakar fires on MP Tejaswi Surya

ఇంటర్నెట్ డెస్క్: పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్‌ బిల్లుపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. తేజస్వి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికే విఘాతం కలిగించేలా ఉన్నాయని, వాటిని లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు. అలాగే తేజస్వి లోక్‌సభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.


'తెలంగాణ డీఎన్ఏ ఉన్న ఎవరైనా తేజస్వి వ్యాఖ్యలను ఖండించాలి. ఈ విషయమై తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎందుకు స్పందించడం లేదు? తేజస్వి సూర్య ఓ తెలివిలేని వ్యక్తి(అసభ్య పదజాలం వాడుతూ). తెలంగాణ ఏర్పాటుపై ఇంత అజ్ఞానంగా మాట్లాడతారా? రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన రాష్ట్రాన్నే అవమానిస్తారా.? తేజస్వి రాజ్యాంగాన్ని కించపరిచేలా మాట్లాడారు. పోరాటం ద్వారా ఏర్పాటైన తెలంగాణను అవమానించారు' అని పొన్నం పేర్కొన్నారు.


మరోవైపు.. తెలంగాణపై తేజస్వి సూర్య దాడిని బీఆర్ఎస్ కూడా ఖండించింది. పార్లమెంట్‌ సాక్షిగా రాజ్యాంగానికి అవమానం జరిగిందని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. తెలంగాణ ఎంపీలకు పౌరుషం ఉందా అని ప్రశ్నిస్తూ.. రాష్ట్రాన్ని అవమానిస్తుంటే ఢిల్లీలో ఊడిగం చేస్తున్నారా అని మండిపడ్డారు. 'ఢిల్లీలో డప్పు కొట్టే ఎంపీలకు తెలంగాణ ఆత్మగౌరవం పట్టదా? తేజస్వి సూర్య అజ్ఞానసూర్యుడు. బలిదానాల చరిత్ర తెలంగాణ.. అది నీ బుర్రకెక్కితేనే నోరు తెరువు. మొరిగే ఎంపీలని ఆపండి.. లేదంటే తెలంగాణ గడ్డపై బీజేపీకి అడుగుపెట్టే అర్హత లేదు' అని సూర్య ప్రసంగంపై ఘాటుగా స్పందించారు శ్రవణ్.

అటు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కూడా ఎంపీ తేజస్వి వ్యాఖ్యలపై మండిపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా రాష్ట్రానికి అవమానం జరిగిందని.. తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ సూర్య క్షమాపణలు చెప్పాలని హరీశ్ డిమాండ్ చేశారు.


ఇవీ చదవండి:

ఈ రాజ్యాంగ సవరణ బిల్లు దేశ చరిత్రలోనే గొప్పది: ప్రధాని మోదీ

డీలిమిటేషన్ బిల్లుపై ప్రతిష్ఠంభన.. ఎంపీలంతా హాజరుకావాలని కాంగ్రెస్ విజ్ఞప్తి

Updated Date - Apr 16 , 2026 | 05:09 PM