డీలిమిటేషన్ బిల్లుపై ప్రతిష్ఠంభన.. ఎంపీలంతా హాజరుకావాలని కాంగ్రెస్ విజ్ఞప్తి
ABN , Publish Date - Apr 16 , 2026 | 01:16 PM
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు టీఎంసీ ఎంపీలు గైర్హాజరవ్వడాన్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తప్పుబట్టారు. ఎంపీలంతా హాజరై కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకించాలని ఆయన కోరారు.
ఇంటర్నెట్ డెస్క్: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుల నేపథ్యంలో విపక్ష కూటమిలో విభేదాలు బయటపడుతున్నట్టు తెలుస్తోంది. పార్లమెంట్‌లో ఈ కీలక బిల్లులపై ఓటింగ్‌కు ముందు జరిగిన సమావేశంలో వివిధ పార్టీలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేయడమే దీనికి కారణం. కేంద్రం తీసుకొస్తున్న ఈ బిల్లుల ద్వారా లోక్‌సభ, అసెంబ్లీలలో మహిళలకు రిజర్వేషన్ అమలును వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే.. ఈ ప్రక్రియను డీలిమిటేషన్‌తో అనుసంధానం చేయడంపై విపక్ష నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు అందరూ పార్లమెంట్‌కు హాజరుకావడం కష్టమవుతోందని ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు సాగరికా ఘోష్ తెలిపారు. అయితే.. టీఎంసీ వైఖరిని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తప్పుపట్టారు. విపక్ష ఎంపీలు ఓటింగ్‌కు హాజరు కాకపోతే అది ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినట్లే అవుతుందని హెచ్చరించినట్టు సమాచారం. అన్ని పార్టీలు తప్పనిసరిగా హాజరై బిల్లును వ్యతిరేకించాలని ఆయన కోరారు.
ఇదిలా ఉండగా.. తమిళనాడులోనూ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ డీఎంకే ఎంపీలు పూర్తి స్థాయిలో హాజరవుతారని ఆ పార్టీ ప్రతినిధి టీఆర్.బాలు స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము వ్యతిరేకం కాదని కొందరు విపక్ష నేతలు ఇప్పటికే తమ అభిప్రాయాలను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా మహిళా రిజర్వేషన్ బిల్లు రాజకీయంగా కొత్త సమీకరణాలకు దారితీస్తుండగా.. విపక్ష ఐక్యతకు ఇది పరీక్ష కాలంగా మారింది.
ఇవీ చదవండి:
మా అభిప్రాయాన్ని ముందే చెప్పాం.. రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై సోనియా గాంధీ
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. మూడు ప్రధాన బిల్లులపై చర్చ