ఈ రాజ్యాంగ సవరణ బిల్లు దేశ చరిత్రలోనే గొప్పది: ప్రధాని మోదీ
ABN , Publish Date - Apr 16 , 2026 | 03:35 PM
131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై పార్లమెంట్ వేదికగా ప్రధాని మోదీ ప్రసంగించారు. కేవలం మౌలిక వసతుల కల్పనే వికసిత్ భారత్ కాదని.. మహిళలకూ అధికారం ఇవ్వాలని ఆయన అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. దేశ చరిత్రలో ఇదో కీలక ఘట్టమని ఈ సందర్భంగా మోదీ వ్యాఖ్యానించారు. కాలానుగుణంగా మనం కూడా మారాలన్నారు. వాస్తవానికి ఈ బిల్లును 30 ఏళ్ల క్రితమే ఆమోదించాల్సిందని చెప్పుకొచ్చిన ఆయన.. ఇది దేశ చరిత్రలోనే గొప్ప బిల్లు అని అభిప్రాయపడ్డారు.
ఈ బిల్లును ఆమోదించడం ప్రస్తుత పార్లమెంట్‌కు ఓ కీలక సువర్ణావకాశమని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. 'దేశానికి సరికొత్త దిశను సూచించే ప్రయత్నం చేస్తున్నాం. దేశంలోని సగం జనాభాకు అధికారం ఇవ్వడం అద్భుత ఘట్టం. వికసిత్ భారత్ అంటే మౌలిక వసతుల కల్పనే కాదు.. మహిళలకు అధికారం ఇవ్వడం కూడా. వికసిత్ భారత్‌లో మహిళల భాగస్వామ్యమే లక్ష్యం. మహిళలకు అధికారమిస్తే దేశానికి సరికొత్త మార్గం చూపిస్తారు. మహిళలకు నిర్ణయాధికారం ఇవ్వడమే మా లక్ష్యం. ఇందులో ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు లేవు. ఈ విషయంలో విపక్షాలను మహిళలు ఎప్పటికీ క్షమించరు' అని ప్రధాని చెప్పుకొచ్చారు.
'పంచాయతీల్లో రిజర్వేషన్లకు అందరూ అంగీకరించారు. లోక్‌సభలో మాత్రం బిల్లును అడ్డుకుంటున్నారు. ఈ బిల్లుకు మద్దతిచ్చే రాజకీయ పార్టీలకే మనుగడ ఉంటుంది. 30 ఏళ్లలో ఇదే అంశం రుజువైంది. మహిళల్లో రాజకీయ చైతన్యం పెరిగింది. అత్యున్నత చట్టసభల్లోనూ భాగస్వామ్యం కోరుతున్నారు. చీపురు పనికాదు.. పార్లమెంట్‌లో సీట్లు అడుగుతున్నారు. ఇప్పుడు బిల్లును వ్యతిరేకించిన వారిని మహిళలే శిక్షిస్తారు' అని మోదీ పేర్కొన్నారు.
అన్ని పార్టీలు మద్దతివ్వండి..
ప్రస్తుతానికి 33 శాతం రిజర్వేషన్లు అమలుచేయనివ్వండని.. ఆ తర్వాత ఓబీసీ, ఇతర వర్గాల కోటాపై ఆలోచిద్దామని పార్లమెంట్ వేదికగా మోదీ కోరారు. 'పార్లమెంట్‌పై నాకు నమ్మకం ఉంది. అత్యంత వెనుకబడిన వర్గానికి చెందిన నాకు ప్రధాని పదవి దక్కింది. తప్పకుండా ఓబీసీలకు న్యాయం చేస్తాం. మహిళా రిజర్వేషన్‌కు రాజకీయ రంగు పులమొద్దు. ఈ బిల్లు రాజకీయ పార్టీల కోసం కాదు.. మహిళల కోసమే. వారు తమ హక్కుల కోసం 30 ఏళ్లుగా పోరాడుతున్నారు. తమ శక్తి నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ బిల్లు వెనుక ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదు. ఈ విషయంలో రాజకీయం చేయొద్దు. రిజర్వేషన్లు మహిళల హక్కు. 2029లో రిజర్వేషన్లు అమలు చేయకపోతే మహిళలకు అన్యాయం జరిగినట్టవుతుంది. వికసిత్ భారత్ సాధనలో మహిళలదే కీలక పాత్ర. ఇప్పటికైనా మహిళా రిజర్వేషన్ ఆలస్యం కాకూడదు. దీనికి అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలి' అని ప్రధాని పిలుపునిచ్చారు.
తప్పుడు ప్రచారం వద్దు..
'దేశమంతా ఒక్కటే.. ప్రాంతీయ భేదాలు ఉండకూడదు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని ప్రాంతాలూ సమానమే. ఉత్తర భారతం, దక్షిణ భారతం అనే తేడా మాకు లేదు. చిన్న రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదు. దేశాన్ని ముక్కలు చేసే అధికారం మనకు లేదు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై నాకు ఎలాంటి క్రెడిట్ అవసరం లేదు. అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలుపుతూ రేపు(శుక్రవారం) ప్రకటన చేస్తా. నా స్వార్థం కోసం బిల్లు అంటూ తప్పుడు ప్రచారం చేయవద్దు' అని మోదీ తన ప్రసంగంలో వివరించారు.
ఇవీ చదవండి:
మహిళా రిజర్వేషన్ బిల్లు ముస్లిం ప్రాతినిధ్యాన్ని తుడిచివేసే చర్య: ఒవైసీ
డీలిమిటేషన్ బిల్లుపై ప్రతిష్ఠంభన.. ఎంపీలంతా హాజరుకావాలని కాంగ్రెస్ విజ్ఞప్తి