గ్యారంటీ లేకుండానే రైస్ మిల్లు ఆస్తుల బదిలీ
ABN , Publish Date - Oct 31 , 2026 | 05:37 AM
రాష్ట్ర పౌర సరఫరాల శాఖలో అవకతవకలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.
పౌర సరఫరాల కమిషనర్ ఆదేశాలు బేఖాతర్
సర్కారు ఖజానాకు రూ.9.44 కోట్ల కుచ్చుటోపీ
ఈ వ్యవహారంలో రూ. కోటి చేతులు మారాయని ఆరోపణలు
మహబూబ్‌నగర్ జిల్లాలో వెలుగు చూసిన ఘటన
ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడి అరెస్టు
హైదరాబాద్/ ములుగు, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పౌర సరఫరాల శాఖలో అవకతవకలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 2023-24 యాసంగి సీజన్‌లో 3,002 మెట్రిక్ టన్నుల (రూ.9,43,82,482 విలువగల) ధాన్యాన్ని దుర్వినియోగం చేసిన ఆలీపూర్‌లోని లక్ష్మీ నరసింహస్వామి రైస్ మిల్లు భాగస్వాములు, డైరెక్టర్లు, వారి కుటుంబ సభ్యుల ఆస్తుల క్రయ, విక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఆ ఆస్తులను నిషేధిత జాబితాలోనూ చేర్చింది. కానీ, మహబూబ్‌నగర్‌లోని శ్రీవెంకటేశ్వర ఇండస్ట్రీస్‌తో కుదిరిన అవగాహనా ఒప్పందం మేరకు ఆలీపూర్‌లోని లక్ష్మీ నరసింహస్వామి ఇండస్ట్రీస్ ఆస్తులు బదిలీ అయ్యాయి. ముందే ఈ ఆస్తుల బదిలీ ఫైలు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్‌కు రాగా, సరైన బ్యాంకు గ్యారంటీలుంటేనే.. ఆస్తుల బదిలీకి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌వోసీ) జారీ జేయాలని జిల్లా అధికారులకు స్టీఫెన్ రవీంద్ర ఆదేశించారు.
కానీ, ఆ ఆదేశాలతో సంబంధం లేకుండానే పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు ‘ఎన్‌వోసీ’ ఇచ్చేడయంతో వెంకటేశ్వర ఇండస్ట్రీస్‌కు ఆస్తులు బదిలీ అయ్యాయని సమాచారం. దీనిపైన వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన స్టీఫెన్ రవీంద్ర శాఖాపరమైన ఆదేశాలకు జారీ చేసిన ఫైలు ప్రస్తుతం పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు సొరుగులో రెండు నెలలుగా మూలుగుతోంది. ఈ బాగోతంలో రూ. కోటి నగదు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. ఇప్పుడు సదరు లక్ష్మి నరసింహస్వామి రైస్ మిల్లు వద్ద సదరు బకాయిలు ఎలా వసూలు చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు, కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సరఫరాలో అక్రమాల కేసులో ములుగు జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు కాట్రగడ్డ సతీశ్‌ను సీఐడీ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. సన్న బియ్యానికి బదులు దొడ్డుబియ్యం బదిలీ చేశారని ఆరోపణలున్నాయి. ఇంతకు ముందు మాజీ అధ్యక్షుడు బాదం ప్రవీణ్‌తోపాటు మరో ఆరుగురు రైస్ మిల్లర్లను అరెస్టు చేసిన సీఐడీ అధికారులు వారిని కోర్టులో హాజరు పరిచారు.
ఈ వార్తలు కూడా చదవండి..
క్యాన్సర్ కేసుల లెక్కలు ఇకపై పక్కాగా..
బీఆర్‌ఎస్ కాపాడిన భూమిని.. రేవంత్ అమ్ముకుంటామనడం సిగ్గుచేటు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News