బీఆర్‌ఎస్ కాపాడిన భూమిని.. రేవంత్ అమ్ముకుంటామనడం సిగ్గుచేటు
ABN , Publish Date - Oct 31 , 2026 | 05:32 AM
బీఆర్‌ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పోరాడి కాపాడిన మియాపూర్ భూములను అమ్ముకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగంగా ప్రకటించడం సిగ్గుచేటని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు పేర్కొన్నారు.
సీఎం చెప్పినవన్నీ అసత్యాలు
మియాపూర్ భూముల రక్షణకు న్యాయ పోరాటం చేసింది బీఆర్‌ఎస్సే: హరీశ్
హైదరాబాద్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పోరాడి కాపాడిన మియాపూర్ భూములను అమ్ముకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగంగా ప్రకటించడం సిగ్గుచేటని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు పేర్కొన్నారు. మియాపూర్ 550 ఎకరాల వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత విలేకరుల సమావేశంలో సీఎం చెప్పినవన్నీ అసత్యాలని.. సుప్రీంకోర్టు రికార్డులే స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో శుక్రవారం ఓ పోస్టు చేశారు. మియాపూర్ భూవివాదం 2003లోనే ఎస్‌ఎల్‌పీగా సుప్రీంకోర్టుకు చేరిందని, 2013లో సివిల్ అప్పీల్‌గా మారిందన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న విలువైన భూమి ప్రభుత్వం చేజారిపోకూడదని నాటి సీఎం కేసీఆర్ దృఢ నిశ్చయంతో వ్యవహరించారన్నారు. 2015లో దేశంలోనే అత్యుత్తమ న్యాయవాదుల్లో ఒకరైన సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్‌ను ప్రత్యేకంగా నియమించారని చెప్పారు.
మియాపూర్ భూముల పరిరక్షణ కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2015 నుంచి 2023 వరకు అలుపెరగని న్యాయపోరాటం చేసిందని హరీశ్ పేర్కొన్నారు. మియాపూర్ భూమికి సంబంధించిన ప్రతి పిటిషన్, ప్రతి అఫిడవిట్, సమగ్ర ఆధారాలను సుప్రీంకోర్టు ముందుంచింది నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఈ వివరాలన్నీ సుప్రీంకోర్టు రికార్డుల రూపంలో ప్రజలకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మియాపూర్ తీర్పునకు అసలు పునాది ‘ట్రినిటీ ఇన్‌ఫ్రావెంచర్స్’ కేసు తీర్పేనన్నారు. గోల్డ్‌స్టోన్ ప్రసాద్‌కు సంబంధించిన ఆ కేసులో 2023 జూన్ 15న తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించిందన్నారు. ఈ కేసులోనూ ప్రభుత్వం తరఫున వైద్యనాథన్ వాదించారని పేర్కొన్నారు. ఈ రికార్డులన్నీ సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో బహిరంగంగా ఉన్నప్పటికీ, తానేదో సాధించినట్లు సీఎం ప్రెస్‌మీట్‌లు పెట్టి సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదం, సిగ్గుచేటని విమర్శించారు. మియాపూర్‌లోని 550 ఎకరాల భూమి విలువ రూ.60వేల కోట్ల పైమాటేనని స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించారన్నారు. ఆ భూములను అమ్ముకోవడానికే ఇప్పుడు బీఆర్ ఎస్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని హరీశ్ ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
క్యాన్సర్ కేసుల లెక్కలు ఇకపై పక్కాగా..
బీజేపీతో పొత్తుకు బీఆర్‌ఎస్ తహతహ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News