జీతాల్లేని బోధన ఎన్నాళ్లు?
ABN , Publish Date - Nov 17 , 2026 | 03:19 AM
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలనే లక్ష్యంతో రాష్ట్రంలో ప్రీ ప్రైమరీ స్కూళ్లను ప్రారంభించిన సర్కారు.. వాటిలో చేరిన చిన్నారులకు బోధించే బోధకుల (ఇన్‌స్ట్రక్టర్ల)కు జీతాలివ్వడం మాత్రం మరిచిపోయింది.
ప్రీ ప్రైమరీ స్కూళ్ల బోధకులు, ఆయాలకు ఐదు నెలలుగా జీతాల్లేవు
రాష్ట్రవ్యాప్తంగా 1,032 స్కూళ్లు, 55 వేల మంది చిన్నారులు
హౖదరాబాద్/హైదరాబాద్ సిటీ, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలనే లక్ష్యంతో రాష్ట్రంలో ప్రీ ప్రైమరీ స్కూళ్లను ప్రారంభించిన సర్కారు.. వాటిలో చేరిన చిన్నారులకు బోధించే బోధకుల (ఇన్‌స్ట్రక్టర్ల)కు జీతాలివ్వడం మాత్రం మరిచిపోయింది. ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాలను నియమించి నాలుగు నెలలు దాటినా ఇంతవరకు ఒక్క నెల వేతనం కూడా ఇవ్బలేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ప్రీ ప్రైమరీ తరగతులను ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 1,032 ప్రాథమిక పాఠశాలల్లో ప్రారంభించారు. ప్రతి ప్రీ ప్రైమరీ స్కూల్‌లో ఇద్దరు సిబ్బందిని నియమించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.
చిన్నారులకు బోధించేందుకు ఒక ఇన్‌స్ట్రక్టర్‌ను, చిన్నారుల ఆలనా పాలనా చూసేందుకు ఆయాను డీఈవోలు నియమించుకోవాలని సూచించింది. ఇన్‌స్ట్రక్టర్‌గా స్థానికంగా ఉన్నవారిని ఎంపిక చేయాలని, ఇంటర్మీడియట్‌లో గరిష్ఠ మార్కులు వచ్చినవారిని నియమించాలని పేర్కొంది. ఇన్‌స్ట్రక్టర్‌కు గౌరవ వేతనంగా రూ.8 వేలు, ఆయాకు రూ.6 వేల చొప్పున చెల్లిస్తారు. ఈ మేరకు అన్ని జిల్లాల్లో నియామకాలు పూర్తయ్యాయి. ప్రతి బడికి ఇద్దరి చొప్పున వీరిని కలెక్టర్లు నియమించారు.
55 వేలకు పైగా ప్రవేశాలు..
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రీ ప్రైమరీ స్కూళ్లలో కలిపి 55 వేలకు పైగా ప్రవేశాలు నమోదయ్యాయి. స్థానిక అంగన్‌వాడీల విద్యార్థులకు సైతం ఇక్కడే బోధన అందిస్తున్నారు. దీంతో సగానికి పైగా బడుల్లో ఈసారి విద్యార్థుల సంఖ్య సగటున 40కి పైగా ఉంది. అయితే వీరికి బోధిస్తున్న ఇన్‌స్ట్రక్టర్లను నియమించి నాలుగు నెలలు దాటినా ఇంతవరకు ఒక్క నెల వేతనం కూడా రాలేదు.
ఎప్పుడైనా జీతాలు వస్తాయి కదా అనే ఉద్దేశంతో.. అనేక చోట్ల ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులే తమ వేతనం నుంచి ఈ ఇన్‌స్ట్రక్టర్లకు గౌరవ వేతనం ఇస్తున్నారు. అయితే ఇవి కూడా అందని చోట ఇన్‌స్ట్రక్టర్‌లు బోధనకు ఆసక్తి చూపించడం లేదు. ప్రభుత్వం ఇస్తున్న వేతనమే చాలా తక్కువ కాగా, అది కూడా సకాలంలో ఇవ్వకపోవడంతో అనేక మంది విధులకు గైర్హాజరవుతున్నట్టు తెలిసింది. నాలుగు నెలలు జీతాలు వెంటనే చెల్లించాలని, ప్రతి నెలా నిధులు విడుదల చేయాలని ప్రీ ప్రైమరీ స్కూళ్ల ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాలు కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
డిసెంబర్ 9న సోనియాగాంధీ సినిమాను ప్రారంభిస్తాం: జగ్గారెడ్డి
అండాల అక్రమ సేకరణ కేసు.. నిందితుల ఆర్థిక లావాదేవీలు, నెట్‌వర్క్‌పై పోలీసుల ఆరా
ఇరిగేషన్ శాఖ డీఈఈ లక్ష్యంగా ఏసీబీ సోదాలు..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News