పాత ఇళ్లకు పట్టాలు
ABN , Publish Date - Nov 17 , 2026 | 04:00 AM
ఉమ్మడి రాష్ట్ర హయాంలో వివిధ ప్రభుత్వ గృహనిర్మాణ పథకాల కింద ఇళ్లు నిర్మించుకున్న పేదలకు గతంలో జారీ చేసిన పట్టాలను తిరిగి వారికి అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
2014కు ముందు గృహ నిర్మాణ పథకాల్లో
ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు అందజేత
ఏడు లక్షల మందికి ప్రయోజనం: పొంగులేటి
హైదరాబాద్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి రాష్ట్ర హయాంలో వివిధ ప్రభుత్వ గృహనిర్మాణ పథకాల కింద ఇళ్లు నిర్మించుకున్న పేదలకు గతంలో జారీ చేసిన పట్టాలను తిరిగి వారికి అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి ప్రభుత్వాలు అమలు చేసిన ఇందిరమ్మ ఇళ్ల పథకంతోపాటు ఇతర పథకాల కింద ఇళ్లు నిర్మించుకున్న వారికి వీటిని అందజేయనున్నట్లు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పేదల సొంతింటిపై హక్కును మరింత పదిలం చేస్తూ ఆయా కుటుంబాలకు భరోసా కల్పించే దిశగా ప్రజాప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. దీంతో దాదాపు 7 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని పేరొన్నారు.
గతంలో అమలు చేసిన ప్రభుత్వ గృహనిర్మాణ పథకాల విధానం ప్రకారం మంజూరు చేసిన ఇళ్లకు పట్టాలు/పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉంది. అయితే దశాబ్ద కాలంగా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు రాకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. మరోవైపు రాష్ట్రంలో 22-ఏ అంశంపై సమీక్షలు జరుగుతున్న సమయంలో ఈ ఇళ్ల పట్టాలు మండలాల తహసీల్దార్ కార్యాలయాల్లో భారీగా ఉన్నాయన్న విషయం వెలుగులోకి వచ్చిందని, ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి వెళ్లడంతో వెంటనే ఆ పట్టాలను పేదలకు తిరిగి ఇవ్వాలని ఆదేశించారని మంత్రి పొంగులేటి తెలిపారు.
2014 కంటే ముందు అమలు చేసిన పథకంలో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వ రాయితీతోపాటు లబ్ధిదారుల వాటా, బ్యాంకు రుణం ద్వారా ఆర్థిక సహాయం అందించేవారని, ఆ రుణాల కోసం లబ్ధిదారుల ఇళ్ల పట్టాలను ష్యూరిటీగా ఉంచుకునేవారని గుర్తు చేశారు. రుణ వాయిదాలన్నింటినీ సక్రమంగా చెల్లించినవారికి తిరిగి ఈ పట్టాలను ఇచ్చేవారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గత ప్రభుత్వం ఇందిరమ్మ పథకాన్ని నిలిపివేయడంతో గతంలోని లబ్ధిదారులకు పట్టాలు అందలేదని మంత్రి పేర్కొన్నారు. దీంతో అప్పటి నుంచి తనఖాలో ఉన్న పట్టాలను లబ్ధిదారులకు ఇవ్వాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ప్రజాప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల
సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News