Share News

నేడే పోలింగ్‌!

ABN , Publish Date - Feb 11 , 2026 | 02:46 AM

తెలంగాణలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది. రాష్ట్రంలోని 116 మునిసిపాలిటీలు, ఏడు కార్పోరేషన్ల పరిధిలోని వార్డు, డివిజన్లకు బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 ....

నేడే పోలింగ్‌!
Telangana Municipal Elections

  • మునిసిపల్‌ ఎన్నికలకు సర్వం సన్నద్ధం

  • 116 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్లు

  • 52 లక్షల మందికి పైగా ఓటర్లు

  • 2981 స్థానాలు.. 12,944 మంది పోటీ

హైదరాబాద్‌, పిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల ప్రక్రియ (Telangana Municipal Elections) కీలక ఘట్టానికి చేరుకుంది. రాష్ట్రంలోని 116 మునిసిపాలిటీలు, ఏడు కార్పోరేషన్ల పరిధిలోని వార్డు, డివిజన్లకు బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. మొత్తం 52,17,413 మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. అందులో మహిళలు 26,67,025 మంది, పురుషులు 25,49,750 మంది, ఇతరులు 638 మంది ఉన్నారు. అధిక సంఖ్యలో ఉన్న మహిళా ఓటర్లే ఈ ఎన్నికల్లో కీలకంగా మారనున్నారు. 116 మునిసిపాలిటీల్లోని మొత్తం 2,582 వార్డులకు గానూ ఇప్పటికే 12 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఒక వార్డులో ఎన్నిక వాయిదా పడింది.


మిగిలిన 2,569 వార్డుల్లో బుధవారం పోలింగ్‌ నిర్వహిస్తారు. మున్సిపాలిటీల్లో 10,719 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఏడు కార్పోరేషన్ల పరిధిలో 414 డివిజన్‌లు ఉండగా రెండు చోట్ల ఏకగ్రీవమైంది. 412 స్థానాలకు నేడు పోలింగ్‌ జరుగుతుంది. 2225 మంది పోటీలో ఉన్నారు. మొత్తంగా 2,981 స్థానాలకు 12,944 మంది బరిలో ఉన్నట్లయింది. మునిసిపాలిటీల్లో 6017 పోలింగ్‌ కేంద్రాలను, కార్పోరేషన్లలో 2,174 పోలింగ్‌ కేంద్రాలను ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. ఎన్నికల ప్రక్రియలో 41,773 మంది పోలింగ్‌ సిబ్బంది, 1,379 మంది రిటర్నింగ్‌ అధికారులు పని చేస్తున్నారు.


పోలీస్‌ శాఖ భద్రత పరంగా అన్ని ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మకమైన 8,191 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ ద్వారా నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఈసీ కార్యదర్శి లింగ్యా నాయక్‌ వెల్లడించారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన రోజు నుంచి రెండున్నర కోట్ల రూపాయల విలువైన నగలు, నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 1,19,68,200 నగదు, రూ.1,04,81,164 మద్యం, రూ.15,68,085 విలువైన డ్రగ్స్‌, రూ.16,29,550 విలువైన నగలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సమస్యలు, ఫిర్యాదులు, సందేహాల నివృత్తి కోసం పౌరులకు టోల్‌ఫ్రీ నంబర్‌ 92400-21456ను కేటాయించారు. టీఈ పోల్‌ యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. దీనిద్వారా పోలింగ్‌ కేంద్రాలను గుర్తించవచ్చు. ఓటర్‌ స్లిప్పులను జనరేట్‌ చేసుకోవచ్చు.


ఈ వార్తలు కూడా చదవండి..

కేంద్రంపై పిచ్చి ప్రేలాపనలు మానుకో.. సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి వార్నింగ్

వందేభారత్‌ రైళ్లకు బాంబు బెదిరింపు!.. రైల్వేశాఖ అలర్ట్..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 11 , 2026 | 07:02 AM