మున్సిపల్ ఎన్నికలు.. చైర్మన్లు, మేయర్ల ఎన్నికపై నెలకొన్న ఉత్కంఠ
ABN , Publish Date - Feb 16 , 2026 | 09:53 AM
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీంతో క్యాంపు రాజకీయాలతో అన్ని పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి. చివరి నిమిషం వరకు రాజకీయ పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.
హైదరాబాద్, ఫిబ్రవరి 16: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడగా.. హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీంతో క్యాంపు రాజకీయాలతో అన్ని పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి. చివరి నిమిషం వరకు రాజకీయ పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక రాష్ట్రంలో మేయర్లు, చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ సోమవారం ప్రారంభం కానుంది. అలాంటి వేళ.. పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విభిన్న పరిస్థితులు నెలకున్నాయి.
తొర్రూర్‌లో తెరపైకి కొత్త వివాదం..
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మున్సిపాలిటీలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఎంపీ కడియం కావ్య ఎక్స్ అఫీషియో ఓటు నమోదుపై బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం తెలిపింది. 2025లోనే ఎక్స్ అఫీషియో మెంబర్‌గా ప్రమాణ స్వీకారం చేశారని ఆ పార్టీ ఆరోపిస్తోంది. అంతేకాకుండా కడియం కావ్య గతంలో చేసిన సోషల్ మీడియా పోస్ట్‌ను బీఆర్ఎస్ పార్టీ ఈ సందర్భంగా వైరల్ చేస్తోంది.
కామారెడ్డిలో ఏ పార్టీకి దక్కని మెజార్టీ..
కామారెడ్డి మున్సిపాలిటీలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. అలాంటి వేళ.. చైర్మన్ పీఠం కోసం అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఇప్పటికే ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మున్సిపాలిటీలో మొత్తం 49 వార్డుల్లో కాంగ్రెస్-22, బీజేపీ-16, BRS-11కు వచ్చాయి. ఇక కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కౌన్సిలర్లు క్యాంపుల్లో ఉన్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్లు కీలకంగా మారనున్నారు. అయితే అధికార కాంగ్రెస్ పార్టీని ఢీ కొట్టేందుకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసే అవకాశం ఉందంటూ ఒక ప్రచారం నడుస్తోంది.
మెదక్‌లో పదవులపై ఉత్కంఠ..
మెదక్ మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ మున్సిపాలిటీల్లో మొత్తం 32 వార్డుల్లో బీఆర్ఎస్ 15, కాంగ్రెస్ 14, బీజేపీ 2, బీఎస్పీ 1 గెలుచుకున్నాయి. బీజేపీ మద్దతు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.
నర్సాపూర్‌లో..
ఇదే జిల్లాలోని నర్సాపూర్‌లో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులపై ఉత్కంఠ నెలకొంది. పట్టణంలోని మొత్తం15 స్థానాల్లో కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 5, బీజేపీ 4 చోట్ల గెలుపొందింది. అయితే బీజేపీకి వైస్ చైర్మన్ పదవిని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ తమకు చైర్మన్ పీఠం కావాలని ఆ రెండు పార్టీలకు బీజేపీ ఇప్పటికే క్లారిటీగా చెప్పినట్లు సమాచారం. ఈ అంశంపై చర్చలు ఒక కొలిక్కి రాకపోవడంతో టెన్షన్ కొనసాగుతోంది.
బెల్లంపల్లి మున్సిపాలిటీలో సైతం..
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో సైతం ఉత్కంఠ ఏర్పడింది. చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో ఐదుగురు ఇండిపెండెంట్లు, ఇద్దరు బీజేపీ కౌన్సిలర్ల మద్దతు కీలకంగా మారింది. ఎక్స్ అఫీషియో ఓటుతో పీఠం కైవసం చేసుకుంటామనే ధీమాలో అధికార కాంగ్రెస్ పార్టీ ఉంది. అలాగే ఆసిఫాబాద్, కాగజ్ నగర్ మున్సిపాలిటీల్లోనూ ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. ఈ రెండు పీఠాలను దక్కించుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రయత్నాలు చేస్తోంది.
కాంగ్రెస్ ఖాతాలోకి..
ఇదే జిల్లాలోని మరో మూడు మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. లక్షెట్టిపేట, చెన్నూర్, నిర్మల్ మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. చైర్మన్, వైస్ చైర్మన్లను ఇప్పటికే ఆ పార్టీ ఖరారు చేసింది. నిర్మల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా అప్పాల కావ్య, లక్షెట్టిపేట చైర్‌పర్సన్ అభ్యర్థిగా అంజలిని ఖరారు చేసింది. క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్, సీపీఐ కూటమిదే పైచేయి కానుంది. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులపై ఇప్పటి వరకు ఆ పార్టీ అధిష్టానం క్లారిటీ ఇవ్వకపోవడం గమనార్హం.
కుదరని సయోధ్య..
నిజామాబాద్ జిల్లా బోధన్‌లో కాంగ్రెస్, ఎంఐఎంల మధ్య సయోధ్య కుదరలేదు. తెరపైకి తీసుకొచ్చిన ఎంఐఎం డిమాండ్లను కాంగ్రెస్ నేతలు ఒప్పుకోలేదు. మొత్తం 38 స్థానాల్లో కాంగ్రెస్-17, ఎంఐఎం12, బీఆర్ఎస్ 5, బీజేపీ-3, ఇండిపెండెంట్-1 గెలుచుకున్నాయి. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థి చేరికతో కాంగ్రెస్ పార్టీ బలం 18కి చేరింది. మరో రెండు స్థానాల కోసం కాంగ్రెస్ నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
కరీంనగర్‌లో మారిన రాజకీయ సమీకరణాలు..
కరీంనగర్ కార్పొరేషన్‌లో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. నగర మేయర్ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన సభ్యుల హాజరుపై ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ సభ్యులు హాజరు కాకుంటే.. మేయర్ పీఠం బీజేపీ కైవసం చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ కార్పొరేషన్‌లో మ్యాజిక్ ఫిగర్-31. కాగా బీజేపీ బలం 34గా ఉంది.
భైంసాలో సైతం..
నిర్మల్ జిల్లా భైంసా మున్సిపాలిటీలో సైతం రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఎంఐఎంకు చెక్ పెట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు ఒక తాటిపైకి వచ్చారు. దాంతో ఎక్స్ అఫీషియోతో కలిపి.. ఈ కూటమి సభ్యుల సంఖ్య 15కి చేరింది. ఇక ఎంఐఎం బలం 12గా ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
జగిత్యాలలో వీడిన చిక్కుముడి.. కామారెడ్డిలో బిగ్ ట్విస్ట్
గన్నవరంలో బిల్ గేట్స్‌కు ఘన స్వాగతం..
For More TG News And Telugu News