వరి ధాన్యం నిల్వకు ఆధునిక సైలోలు
ABN , Publish Date - Nov 08 , 2026 | 03:35 AM
వరి ధాన్యాన్ని శాస్ర్తీయ పద్ధతుల్లో ఆరబెట్టి, నాణ్యతను కాపాడుతూ ఎక్కువ కాలం భద్రపరిచేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆధునిక సైలోలను ఏర్పాటుకు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది.
తేమను నియంత్రించి, శుభ్రపరిచి నిల్వ చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణం
ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశం
హైదరాబాద్, నవంబరు7 (ఆంధ్రజ్యోతి): వరి ధాన్యాన్ని శాస్ర్తీయ పద్ధతుల్లో ఆరబెట్టి, నాణ్యతను కాపాడుతూ ఎక్కువ కాలం భద్రపరిచేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆధునిక సైలోలను ఏర్పాటుకు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. పంట కోత తర్వాత నిల్వ నష్టాలను తగ్గించడం, మార్కెట్‌లో మంచి ధర వచ్చేవరకు రైతులు ఆ ధాన్యాన్ని భద్రపరచుకునే వీలు కల్పించడం ఈ కార్యక్రమం లక్ష్యం. సైలోల నిర్మాణం, నిర్వహణ, నిధుల సమీకరణపై శనివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్షించారు. సైలోల నిర్మాణ, నిర్వహణ వ్యయాలు, నిధుల సమీకరణ, అద్దె చెల్లింపు అంశాలను అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు.
తక్కువ వడ్డీకి ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. సైలోల నిర్మాణానికి అనువైన ప్రదేశాలను గుర్తించి, ఆర్థిక, సాంకేతిక నిపుణులతో సంప్రదించి ప్రతిపాదనలను త్వరితగతిన ఖరారు చేయాలని కోరారు. దాన్యాన్ని పెద్ద మొత్తంలో నిల్వ చేయగల భారీ ఉక్కు గిడ్డంగులే సైలోలు. ప్రతిపాదిత సైలోల్లో ధాన్యాన్ని తూకం వేసేందుకు తూకం వంతెనలు, తేమ, నాణ్యతను పరీక్షించేందుకు ప్రయోగశాల ఏర్పాటు చేస్తారు. ధాన్యంలోని మట్టి, చెత్త వంటి మలినాలను యంత్రాలతో తొలగిస్తారు. తేమ ఎక్కువగా ఉన్న ధాన్యాన్ని డ్రయర్లతో ఆరబెట్టి, సురక్షిత నిల్వకు అనువైన స్థాయికి తేమను తగ్గిస్తారు. ఆరబెట్టిన ధాన్యాన్ని యంత్రాలతో నేరుగా ఉక్కు సైలోల్లోకి తరలించి నిల్వ చేస్తారు. ఈ పద్ధతిలో గోనె సంచుల వినియోగం తగ్గుతుంది.
నిల్వ సమయంలో ధాన్యం నాణ్యతను పరీక్షించేందుకు, పురుగుల బెడదను తప్పించేందుకు ఏర్పాట్లను చేస్తారు. సైలోల నిర్మాణానికి రెండు నమూనాలను పరిశీలిస్తున్నారు. మొదటి విధానంలో తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ గుర్తింపు పొందిన ఆర్థిక సంస్థల నుంచి రుణాలు సమీకరించి నేరుగా సైలోలను ఏర్పాటు చేస్తుంది. రెండో విధానంలో తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా గుర్తించే సుమారు 20 ప్రదేశాల్లో ప్రైవేటు సంస్థలను సైలోలు ఏర్పాటు చేసేలా ప్రోత్సహిస్తారు. ఈ విధానంలో ప్రైవేటు సంస్థలకు గిట్టుబాటు అయ్యేలా నిర్ణీత కాలానికి అద్దె చెల్లింపుల హామీ ఇచ్చే ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. సమీక్ష సమావేశంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర, అదనపు డైరెక్టర్ రోహిత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News