Keesara Incident: కీసరలో దారుణం.. వ్యక్తిపై దాడి.. పరిస్థితి విషమం..
ABN , Publish Date - Jan 08 , 2026 | 08:55 AM
కీసరలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిపై దాడి జరిగింది. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయం స్థానికులకు, పాల పరిశ్రమ నిర్వాహకులకు భయాందోళనకు గురిచేసింది.
మేడ్చల్, జనవరి8 (ఆంధ్రజ్యోతి): కీసరలో దారుణం జరిగింది. గురువారం వేకువజాము ఓ వ్యక్తిపై తల్వార్‌తో దారుణంగా (Keesara Incident) దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన వ్యక్తిని తెలంగాణ దొడ్ల మిల్క్ మేనేజర్ శ్రీనివాస్‌గా గుర్తించారు. ఈ దాడితో స్థానికులు, పాల పరిశ్రమ నిర్వాహకులు భయాందోళనకు గురి అయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ దాడిపై వెంటనే మేడ్చల్ జిల్లా పోలీసులకు సమాచారం అందజేశారు.
తల్వార్‌తో బలంగా దాడి...
మేడ్చల్ జిల్లా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ దొడ్ల మిల్క్ మేనేజర్ శ్రీనివాస్ ఈరోజు ఉదయం కీసరకు హుండాయ్ ఐ20 రెడ్ కారులో (TS 08 EP 7851) బయలుదేరారు. ఆయన కీసర ప్రధాన కేంద్రమైన మార్కెట్ ప్రాంతంలోకి రాగానే పాల వ్యాపారి కిరణ్ అనే వ్యక్తి తల్వార్‌తో బలంగా దాడి చేశాడు. ఈ దాడిలో ఆయనకి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శ్రీనివాస్‌ని వెంటనే శ్రీకర ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు ఆస్పత్రిలో వైద్యం అందజేస్తున్నారు. శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. శ్రీనివాస్ మౌలాలి వాసిగా గుర్తించారు.
పాల బకాయిలపై వాగ్వాదం..
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. పాల వ్యాపారి కిరణ్ దొడ్ల కంపెనీకి బకాయిలు చెల్లించలేదు. బకాయిలు చెల్లించాలని పలుమార్లు కిరణ్‌ను అడిగారు. ఈ క్రమంలోనే శ్రీనివాస్, కిరణ్ మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం బకాయిల విషయంపై మరోసారి నిలదీశారు. దీంతో కోపంతో శ్రీనివాస్‌పై కిరణ్ కిరాతకంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. నిందితుడి కోసం కీసర పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన జరిగిన ప్రాంతాన్ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సంఘటన స్థలంలో సాక్ష్యాలు సేకరిస్తున్నారు. ఆధారాల కోసం దగ్గరలోని సీసీ కెమెరాలను కూడా చూశారు. నిందితుడు కిరణ్ కోసం ప్రత్యేక బలగాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
కుటుంబ సభ్యుల ఆందోళన..
ఈ ఘటనతో కీసర మార్కెట్ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. పాల వ్యాపారులు, శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దాడితో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. శ్రీనివాస్‌కు మరింత భద్రతా పెంచాలని కుటుంబ సభ్యులు కోరారు. కిరణ్‌ను వెంటనే పట్టుకోవాలని లేకపోతే శ్రీనివాస్‌కి ప్రాణహాని ఉంటుందని కుటుంబ సభ్యులు విన్నవించారు. శ్రీనివాస్‌కు భద్రత పెంచుతామని, కుటుంబ సభ్యులు ఆందోళన చెందవద్దని పోలీసులు నచ్చజెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి...
సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా మంటలు వ్యాపించి..
విద్యార్థులకు అలర్ట్.. సంక్రాంతి సెలవులపై క్లారిటీ..
Read Latest Telangana News And Telugu News