Share News

‘హెచ్‌పీవీ’ వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం

ABN , Publish Date - Feb 28 , 2026 | 01:15 PM

మహిళల ప్రాణాలను హరిస్తున్న గర్భాశయ క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) నివారణ దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. సర్వైకల్ క్యాన్సర్ నివారణే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా శనివారం హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్ పంపిణీకి శ్రీకారం చుట్టింది. వివరాల్లోకి వెళితే..

‘హెచ్‌పీవీ’ వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం
Telangana HPV Vaccine Drive

హైదరాబాద్, ఫిబ్రవరి 28: మహిళల ప్రాణాలను హరిస్తున్న గర్భాశయ క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) నివారణ దిశగా తెలంగాణ ప్రభుత్వం శనివారం హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) వ్యాక్సిన్ పంపిణీకి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌లోని కింగ్ కోఠి హాస్పిటల్‌లో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభించారు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ.


ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆడబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కాలుష్యం కారణంగా దేశవ్యాప్తంగా క్యాన్సర్ మహమ్మారి కోరలు చాస్తోంది. దురదృష్టవశాత్తు, మన రాష్ట్రంలో కూడా ఏటా 55,000 నుండి 60,000 క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. రాబోయే ఐదేళ్లలో ఈ సంఖ్య మరో 10% పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేన్సర్ వైద్య సేవలు కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా, ములుగు, ఆదిలాబాద్ వంటి మారుమూల జిల్లాల్లో కూడా ఇప్పుడు కీమోథెరపీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాం. దేశంలో మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో సర్వైకల్ కేన్సర్ రెండవ స్థానంలో ఉంది. మన రాష్ట్రంలో ఏటా సగటున 3,200 మంది మహిళలు ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఈ క్యాన్సర్ 99.7% మంది పేషెంట్లకు హ్యూమన్ పాపిలోమా అనే వైరస్ వల్లే వస్తుంది. వైరస్‌ను అంతం చేయడానికే.. ఈ రోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో, రాష్ట్రవ్యాప్తంగా HPV వ్యాక్సినేషన్ డ్రైవ్ కు శ్రీకారం చుట్టాం. ఈ డ్రైవ్‌లో భాగంగా, 14 ఏళ్లు నిండి, 15 ఏళ్లు లోపు ఉన్న బాలికలందరికీ మనం వ్యాక్సిన్ వేయబోతున్నాం. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3.5 నుండి 4 లక్షల మంది బాలికలకు రాబోయే 3 నెలల్లో వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. బయట ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ 'గార్డాసిల్' (Gardasil) వ్యాక్సిన్ ఒక్క డోసు వేసుకోవాలంటే 3,000 నుండి 4,000 రూపాయలు అవుతుంది. కానీ, ప్రభుత్వం దీనిని పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. నేటి నుంచి 3 నెలల వరకూ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగనుంది. నెల రోజుల వరకూ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్, ఏరియా హాస్పిటల్స్, కమ్యునిటీ హెల్త్‌ సెంటర్లతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ టీకా లభిస్తుంది. త్వరలోనే పీహెచ్‌సీల్లో కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. తల్లిదండ్రులందరి‌కీ నా విజ్ఞప్తి. మీ ఇంట్లో 14 ఏళ్ల ఆడబిడ్డ ఉంటే, వెంటనే ముందుకు వచ్చి ఈ టీకా ఇప్పించండి. మన ఆడబిడ్డల భవిష్యత్తును, తద్వారా తెలంగాణ భవిష్యత్తును కాపాడుకుందాం’ అని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

‘రైతు భరోసా’పై మోసగించిన కాంగ్రెస్‌

కవిత విషయంలో తప్పు చేశామా?

Read Latest Telangana News and National News

Updated Date - Feb 28 , 2026 | 01:33 PM