Share News

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభించిన ప్రధాని మోదీ

ABN , Publish Date - Feb 28 , 2026 | 11:47 AM

రాజస్థాన్‌‌లోని అజ్మీర్‌లో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. శనివారం రాజస్థాన్‌లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు.

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభించిన ప్రధాని మోదీ
PM Modi in Rajasthan

జైపూర్, ఫిబ్రవరి 28: రాజస్థాన్‌‌లోని అజ్మీర్‌లో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. శనివారం రాజస్థాన్‌లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా అజ్మీర్‌లో ఆయన ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. 14 సంవత్సరాల వయస్సు గల బాలికలకు దేశవ్యాప్తంగా హ్యూమన్ పాపిల్లోమావైరస్ ( హెచ్‌పీవీ) టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రతి ఏడాది14 సంవత్సరాల వయస్సు గల సుమారు 1.15 కోట్ల మంది బాలికలను లక్ష్యంగా చేసుకుని.. ఈ వ్యాక్సిన్ టీకాలు వేయనున్నారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఈ టీకాను ఉచితంగా వేయనున్నారు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నివారించే లక్ష్యంతో ఈ వ్యాక్సినేషన్‌ను కేంద్రం దేశవ్యాప్తంగా ప్రారంభించిన విషయం విదితమే.


ఈ ఏడాది తొలిసారిగా రాజస్థాన్ పర్యటనకు ప్రధాని మోదీ వచ్చారు. అజ్మీర్ పర్యటన సందర్భంగా రాజస్థాన్‌లో రూ.16,686 కోట్లకు పైగా విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ.. పలు శంకుస్థాపనలు చేశారు. వాటిలో రాష్ట్ర స్థాయిలో 34 ప్రాజెక్టులను రూ. 8,554 కోట్లతో చేపట్టనున్నారు. అలాగే 8,132 కోట్ల విలువైన తొమ్మిది జాతీయ రహదారి,ఇంధన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలతోపాటు ప్రారంభోత్సవాలను చేపట్టారు.


రాజస్థాన్‌లో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన దాదాపు 21,863 మంది యువ అభ్యర్థులకు ప్రధాని మోదీ నియామక లేఖలను అందజేశారు. రెవెన్యూ శాఖలో పట్వారీలు, కాంట్రాక్ట్ అకౌంటింగ్ అసిస్టెంట్లు, పశువుల సహాయకులు, చీఫ్ హెల్త్ ఆఫీసర్లు, పబ్లిక్ హెల్త్ కేర్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సింగ్ ఇన్‌ఛార్జ్‌లతోపాటు ఆరోగ్య సంరక్షణ, పరిపాలనా సిబ్బంది ఈ నియామక పత్రాలు పొందిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ, గవర్నర్ హరిభౌ కిసన్ రావు బాగ్డే, బీజేపీ రాష్ట్ర చీఫ్ మదన్ రాథోడ్‌తోపాటు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

డిప్యూటీ సీఎం పవన్ కారు ధ్వంసం ఘటన.. అధికారులపై చర్యలు..

గాదె ఇన్నయ్య తండ్రి మృతి

For More National News And Telugu News

Updated Date - Feb 28 , 2026 | 01:19 PM