Share News

డిప్యూటీ సీఎం పవన్ కారు ధ్వంసం ఘటన.. అధికారులపై చర్యలు..

ABN , Publish Date - Feb 28 , 2026 | 11:15 AM

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్యాలయంలోకి ఓ వ్యక్తి చొరబడి.. కారును ధ్వంసం చేసిన ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ ఘటనకు భద్రతా వైఫల్యమే ప్రధాన కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేల్చింది. వెంటనే సంబంధిత అధికారులను..

డిప్యూటీ సీఎం పవన్ కారు ధ్వంసం ఘటన.. అధికారులపై చర్యలు..

గుంటూరు, ఫిబ్రవరి 28: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్యాలయంలోకి నిన్న(శుక్రవారం) ఓ వ్యక్తి చొరబడి కారును ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఘటనకు భద్రతా వైఫల్యమే ప్రధాన కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో భద్రతా విభాగం నుంచి ఐదుగురిని వెనక్కి పంపింది. రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ బి.పెంటారావుతో పాటు మరో నలుగురు కానిస్టేబుళ్లను మాతృ విభాగంలో రిపోర్ట్ చేయాలంటూ ఆదేశించింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


ఇంతకీ ఏం జరిగిందంటే..?

మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం, డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయంతోపాటు పవన్ కల్యాణ్ నివాసం ఒకే చోట ఉంటాయి. శుక్రవారం ఉదయం ఈ ప్రాంగణంలోకి ఓ వ్యక్తి ప్రవేశించాడు. ఈ విషయాన్ని కార్యాలయ సిబ్బంది ఒకరు గమనించి.. అతడిని ఆపే ప్రయత్నం చేశారు. అంతలో ఆ వ్యక్తి బయటకు పరుగుతీసి.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్‌లోని వాహనం అద్దాలను ధ్వంసం చేశాడు. అతడిని వెంటనే భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.


పోలీసుల విచారణలో నిందితుడు పొంతన లేని సమాధానాలు చెప్పాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తి పేరు నారద నీలాద్రి అని పోలీసులు తెలిపారు. అతడి స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం ఖాజూరుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. భద్రతా వైఫల్యం కారణంగానే ఈ దాడి జరిగినట్లు గుర్తించారు. దీంతో ఈ ఘటన జరిగిన సమయంలో విధుల్లో ఉన్న వారిపై చర్యలు తీసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సౌరశక్తి.. అనాసక్తి

గాదె ఇన్నయ్య తండ్రి మృతి

For More AP News And Telugu News

Updated Date - Feb 28 , 2026 | 11:50 AM