సౌరశక్తి.. అనాసక్తి
ABN , Publish Date - Feb 28 , 2026 | 10:30 AM
సూర్యఘర్ యోజన లక్ష్యాలు నీరుగారి పోతున్నాయి. సౌరశక్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తున్నా.. విద్యుత్ వినియోగదారుల నుంచి స్పందన కానరావడం లేదు.
సూర్యఘర్ పథకంపై స్పందన కరువు
రాయితీ ఉన్నా కానరాని స్పందన
అనుమతించిన దరఖాస్తులు 2,56,069
సోలార్ యూనిట్ల ఏర్పాటు 11,693
4.56 శాతం దాటని లక్ష్యం
సూర్యఘర్ యోజన లక్ష్యాలు నీరుగారి పోతున్నాయి. సౌరశక్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తున్నా.. విద్యుత్ వినియోగదారుల నుంచి స్పందన కానరావడం లేదు. సౌర పలకల ఏర్పాటులో వారి అవగాహన రాహిత్యం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలను చైతన్య పరచడంలో అధికార యంత్రాంగం కూడా విఫలమవుతోంది. ఇళ్లకు వెళ్లిన విద్యుత్ సిబ్బంది మొబైల్‌లో పేరు, ఓటీపీ నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇప్పటికీ పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో 2,56,069 దరఖాస్తులను విద్యుత్ అధికారులు ఆమోదించారు. కానీ 11,693 యూనిట్లు మాత్రమే ఏర్పాటు చేయడం గమనార్హం. కేవలం 4.56 శాతం మాత్రమే సోలార్ ప్లాంట్లు నెలకొల్పారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా ఇచ్చినా ఆశించించిన మేర ఫలితాలు కానరావడం లేదు.
తెనాలి, ఫిబ్రవరి 28: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సూర్యఘర్ యోజన పథకాన్ని అమలు చేస్తున్నాయి.. ప్రజలకు విద్యుత్ ఛార్జీల భారం తగ్గించి, విద్యుత్ ఉత్పత్తిలో బొగ్గు వినియోగాన్ని తగ్గించడం ద్వారా కాలుష్యాన్ని అదుపు చేసే నేపథ్యంలో సోలార్ ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. సూర్యఘర్ పథకం కింద గృహాలకు సోలార్ యూనిట్ల ఏర్పాటులో పెద్ద ఎత్తున రాయితీలను కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. అయితే వినియోగదారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడంలో నెలకొన్న నిర్లక్ష్యం వల్ల.. స్పందన కనిపించడం లేదు.
సౌరశక్తితో ఆదాయం..
గృహ విద్యుత్ వినియోగం120 యూనిట్లు దాటితే సుమారు రూ.1,000 బిల్లు వస్తుంది. అదే సోలార్ రూప్ టాప్‌తో కేవలం రూ.338 మాత్రమే ఖర్చవుతుందని అధికారులు చెబుతున్నారు. దీని వల్ల ఏడాదికి రూ. 8 వేలు వరకు ఆదా అవుతుంది. సూర్య ఘర్ పధకంలో వంద చదరపు అడుగుల స్థలంలో 120 యూనిట్లు ఉత్పత్తి చేసే కిలో వాట్ సామర్థ్యం ఉన్న సోలార్ పలకలు ఏర్పాటు చేసుకోవచ్చు. అందుకు సుమారు రూ. 60 వేలు ఖర్చు అవుతోంది. అందులో 50 శాతం, అంటే రూ.30 వేలు ప్రభుత్వం రాయితీగా ఇస్తుంది. మిగిలిన మొత్తం బ్యాంకుల నుంచి రుణంగా పొందొచ్చు. ఇది కూడా నాలుగేళ్లలో విద్యుత్తు బిల్లు రూపేణా ఆదా చేసుకోవచ్చు. అనంతరం ప్రతి యూనిట్ నుంచి ఆదాయం పొందే అవకాశం ప్రభుత్వం కల్పించింది. యూనిట్ల ఏర్పాటులో తీవ్ర జాప్యం జరగుతుండటం కూడా పథకం అమలు వినియోగదారుల నుంచి స్పందన రావడం లేదు.
ప్రభుత్వ కార్యాలయాల్లోనూ.. అంతే
ప్రభుత్వ కార్యాలయాల్లోనూ సౌరశక్తి యూనిట్లు ఏర్పాటు నామ మాత్రంగా కూడా లేదు. సోలార్ పథకం అమలుపై అధికారుల నుంచి కూడా స్పందన కరువైంది. ఇంటి అవసరాల తర్వాత మిగిలితే విద్యుత్తును గ్రిడ్కు పంపించి.. తద్వారా ఆదాయం పొందొచ్చు. దీనిపై కూడా అవగాహన కల్పించాల్సి ఉంది.
ఎస్సీ, ఎస్టీలకు పూర్తిగా ఉచితం
ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సూర్య ఘర్ పథకాన్ని ఉచితంగా ప్రభుత్వం అందిస్తోంది. అయినా కూడా సదరు వర్గాల ఇళ్లల్లో సోలార్ యూనిట్ల ఏర్పాటు నత్తనడక కన్నా నిదానంగా సాగుతోంది. పల్నాడు జిల్లాలో 50,379 దరఖాస్తులు ఆమోదించగా ఇప్పటికి 64 యూనిట్లు ఏర్పాటు చేసినట్లు విద్యుత్ శాఖ లెక్కలు చెబుతున్నాయి, బాపట్ల జిల్లాలో 34,149 దరఖాస్తులు అమోదించగా 173 యూనిట్లు ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లాలో 49,393 దరఖాస్తులకుగాను 179 యూనిట్లు ఏర్పాటు చేశారు.
సౌరశక్తి యూనిట్ల ఏర్పాటు ఇలా..
జిల్లా అమోదించినవి.. ఏర్పాటైన యూనిట్లు..
పల్నాడు: 1,35,455 ఆమోదించగా.. 2,412 ఏర్పాటైనవి.
బాపట్ల: 56,751 ఆమోదించగా.. 4.389 ఏర్పాటైనవి.
గుంటూరు: 63,863 ఆమోదించగా.. 4,892 ఏర్పాటైనవి.
పల్నాడు జిల్లాలో సోలార్ యూనిట్ల ఏర్పాటు కోసం 1,35,598 దరఖాస్తులు వచ్చాయి. విద్యుత్ శాఖ1,35,455 దరఖాస్తులను అమోదించింది. వీటి సామర్థ్యం 3,08,289 కిలోవాట్లుగా అంచనా వేశారు. యూనిట్ ఏర్పాటుకు సంబంధిత ఏజెన్సీలకు 50,307 అనుమతి ఇవ్వగా ఇప్పటి వరకు 2,412 యూనిట్లు మాత్రమే ఏర్పాటయ్యాయి.
బాపట్ల జిల్లాలో 56,799 దరఖాస్తులకు 56,751 అమోదించారు. వీటి సామర్థ్యం 1,59,251 కిలోవాట్లుగా అంచనా. ఏజెన్సీలకు 40,406 యూనిట్లు ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వగా.. ఇప్పటి వరకు 4,389 యూనిట్ల ఏర్పాటు చేశారు.
గుంటూరు జిల్లాలో 63,863 దరఖాస్తులను ఆమోదించారు. వీటి 1,43,216 కిలోవాట్లగా నిర్ధారించారు. యూనిట్లు అమర్చేందుకు వెండార్లకు 1,46,540కి అనుమతి ఇవ్వగా.. ఇప్పటికి 4,892 యూనిట్లు ఏర్పాటు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళలకు గుడ్ న్యూస్.. నేటి నుంచే హెచ్‌పీవీ వ్యాక్సిన్ ..
For AP News And Telugu News