కర్ణాటకలో 80 శాతం రికార్డులు పక్కా
ABN , Publish Date - Nov 24 , 2026 | 04:54 AM
భూముల పూర్తిస్థాయి ప్రక్షాళనకు తెలంగాణ సర్కారు సన్నద్ధమవుతోంది. రీ సర్వేకు సిద్ధపడుతోంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో రీ సర్వే జరుగుతోంది. అక్కడ అమలు చేసిన తీరును అధ్యయనం చేసింది.
20 ఏళ్ల నుంచి దశలవారీగా ప్రక్షాళన..
లావాదేవీల సమయంలో కో ఆర్డినేట్ల జారీ
ఏపీలో హైబ్రిడ్ విధానం.. 5000 గ్రామాల్లో పూర్తి
గుజరాత్‌లో 9,680 గ్రామాల్లో ప్రాపర్టీ కార్డులు
తప్పులు లేని రికార్డుల తయారీయే కీలకం
హైదరాబాద్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): భూముల పూర్తిస్థాయి ప్రక్షాళనకు తెలంగాణ సర్కారు సన్నద్ధమవుతోంది. రీ సర్వేకు సిద్ధపడుతోంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో రీ సర్వే జరుగుతోంది. అక్కడ అమలు చేసిన తీరును అధ్యయనం చేసింది. వాటిలో కర్ణాటకలో అనుసరించిన తీరు బాగుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ రాష్ట్రంలో 80 శాతం రికార్డులను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేశారు. డిజిటల్ మ్యాపులు, క్యూఆర్ కోడ్‌లతో రికార్డులను పక్కాగా రూపొందించారు. ఇదంతా రాత్రికి రాత్రి జరిగిపోయింది. కాదు. దీని వెనక, దాదాపు రెండు దశాబ్దాల కృషి ఉంది. దాదాపు 20 ఏళ్ల నుంచి దశలవారీగా తప్పులను సరిదిద్దుతూ వస్తున్నారు. భూముల క్రయ విక్రయాల లావాదేవీ జరిగినప్పుడు క్షేత్ర స్థాయిలో సర్వే చేస్తున్నారు. సదరు భూములకు అక్షాంశ, రేఖాంశాలను ఇస్తున్నారు.
మన రాష్ట్రం తరహాలోనే కోర్సు స్టేషన్లతో అనుసంధానమైన జీపీఎస్ రోవర్లను వినియోగించి భూముల హద్దులు గుర్తించింది. భూముల అక్షాంశ, రేఖాంశాలను నిర్ధారించింది. డిజిటల్ స్కెచ్‌లను తయారు చేసింది. డిజిటల్ మ్యాపులు, క్యూఆర్ కోడ్‌లతో రికార్డులను అందుబాటులోకి తెచ్చింది. భూముల రీ సర్వే విషయంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధానాన్ని అమలు చేయకపోయినా కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్, గుజరాత్ విధానాలు కాస్త మెరుగ్గా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే, కర్ణాటకలో మరో ముఖ్యమైన ప్రయోగం దిశాంక్ మొబైల్ యాప్. దీనిని కర్ణాటక జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌లో భాగంగా కేఎస్ఆర్‌ఎస్ఏసీ అభివృద్ధి చేసింది. దీని ద్వారా పౌరులు తమ మొబైల్‌లో భూమికి సంబంధించిన సర్వే వివరాలు, మ్యాప్‌లను పరిశీలించవచ్చు. భూమి సర్వే నంబరును గుర్తించడం, భౌగోళిక స్థానాన్ని పరిశీలించడం, డిజిటల్ మ్యాప్‌ల వీక్షించడం, భూమి వివరాలను క్షేత్రస్థాయిలో సరిపోల్చుకునే అవకాశం ఉండడం దీని ప్రధాన ప్రయోజనాలు.
ఏపీలో హైబ్రిడ్ నమూనా
పొరుగున్న ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో డ్రోన్, కోర్సు, రోవర్ల సమ్మిళత విధానం అమలు చేశారు. హైబ్రిడ్ విధానంలో అక్కడ సర్వే చేపట్టారు. శాశ్వత భూహక్కు- భూరక్ష పథకం పేరుతో 2020లో ఏపీలో సమగ్ర రీ సర్వే చేపట్టారు. ఇందుకు డ్రోన్లు, చిన్న చిన్న విమానాలు, హెలికాప్టర్లతో చిత్రాలు సేకరించారు. కోర్స్ నెట్‌వర్క్ వినియోగించి, జీఎన్‌ఎస్ఎస్ రోవర్లతో భూముల హద్దుల కొలతలు సేకరించారు. ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజస్ (ఓఆర్‌ఐ) తయారీ, పాత ఎఫ్‌ఎంబీల కొలతలతో సరిపోల్చారు. రైతులకు ముందస్తు సమాచారం ఇచ్చి గ్రామసభల ద్వారా చైతన్యపరిచారు. హద్దుల నిర్ణయం, సర్వే రాళ్ల ఏర్పాటు, డిజిటల్ రికార్డుల తయారీ వంటి ప్రక్రియలు అవలంభించారు. 2023 నవంబరునాటికి సుమారు 5 వేల గ్రామాల్లో రీ సర్వే పనులు పూర్తయినట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
గుజరాత్‌లో డ్రోన్ మ్యాపింగ్ ఆధారిత రికార్డులు
ప్రాపర్టీ కార్డు నమూనాను గుజరాత్ అనుసరించింది. భూముల రీ సర్వేను ప్రస్తుత ప్రధాని మోదీ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మొదలుపెట్టారు. సర్వేను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించారు. ప్రజల్లో అసంతృప్తి రాకుండా స్థానిక ఎమ్మెల్యేలను గ్రామాలకు పంపి.. ప్రజలకు వివరించేలా ఏర్పాట్లు చేయించారు. సర్వే జరిగే ప్రక్రియపై ప్రత్యేక ప్రదర్శనలు ఇప్పించారు. కేంద్ర ప్రభుత్వ పథకం స్వామిత్వను ఉపయోగించుకున్నారు. దీనిద్వారా గ్రామ కంఠం, నివాస ప్రాంతాల్లోని ఆస్తుల హద్దులను డ్రోన్ల ద్వారా గుర్తించారు. డ్రోన్ సర్వేతో నివాస ప్రాంతాలను మ్యాపింగ్ చేశారు. సర్వే ఆఫ్ ఇండియా ద్వారా మ్యాప్‌ల తయారీ చేపట్టారు.
గ్రామ సువిధ పోర్టల్ ద్వారా యజమానుల వివరాలు అనుసంధానం చేశారు. హక్కుల నిర్ధారణ, అభ్యంతరాల పరిశీలన అనంతరం తుది ప్రాపర్టీ కార్డులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ సమాచారం ప్రకారం.. 2025 డిసెంబరు నాటికి గుజరాత్‌లో 14,670 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తి చేశారు. 9,680 గ్రామాల్లో సుమారు 15.7 లక్షల మందికి ప్రాపర్టీ కార్డులు జారీ చేశారు. వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన సర్వేలను పరిశీలిస్తే.. రీ సర్వేలో పాత రికార్డులను ప్రక్షాళన చేయడం, భౌతిక హద్దులను నిర్ధారించడం, రైతుల అభ్యంతరాలను పరిష్కరించడం, భవిష్యత్తులో రికార్డులు మళ్లీ తప్పులబారిన పడకుండా చూడటం అత్యంత కీలకమని తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి...
పార్టీకి నష్టం చేసేలా మాట్లాడితే చర్యలు.. సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
హైదరాబాద్‌లో ఉగ్రదాడుల హెచ్చరిక.. పోలీసుల హై అలర్ట్!
తెలంగాణలో ష్నైడర్ సంస్థ విస్తరణకు పూర్తి సహకారం అందిస్తాం: భట్టి విక్రమార్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News