18 శాతం బాల్య వివాహాలే
ABN , Publish Date - Nov 24 , 2026 | 03:54 AM
దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే బాల్య వివాహాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది.. తగిన వయసు రాకముందే వివాహాలు చేయడం వల్ల 18 సంవత్సరాల్లోపు బాలికలు రక్తహీనత, ఇతర తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని విద్యాశాఖ ఇటీవల చేసిన అధ్యయనంలో వెల్లడైంది.
దక్షిణాదిలో తెలంగాణలోనే అత్యధికం
18 ఏళ్లలోపు ప్రతి ముగ్గురు బాలికల్లో ఇద్దరికి రక్తహీనత
టెన్త్ పూర్తవగానే పెళ్లి చేయడమే కారణం
విద్యాశాఖ అధ్యయనంలో వెల్లడి
పదో తరగతి తర్వాత విద్యను కొనసాగిస్తే బాల్య వివాహాలు ఆపొచ్చని సూచన
హైదరాబాద్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే బాల్య వివాహాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది.. తగిన వయసు రాకముందే వివాహాలు చేయడం వల్ల 18 సంవత్సరాల్లోపు బాలికలు రక్తహీనత, ఇతర తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని విద్యాశాఖ ఇటీవల చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ఎక్కువమంది తల్లిదండ్రులు తమ కుమార్తెలను పదో తరగతితో చదువు మాన్పించి పెళ్లిళ్లు చేస్తున్నారని పరిశీలనలో తేలింది. వచ్చే ఏడాది నుంచి ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ దిశగా అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు.
అయితే సీఎం తీసుకున్న ఈ నిర్ణయం వెనక విద్యాశాఖ ప్రభుత్వానికి సమర్పించిన ఈ అధ్యయన నివేదిక కూడా ఒక కారణం. ఇందులో బాలికా విద్య, ఆరోగ్యంపై దక్షిణాది రాష్ట్రాలతో పోలుస్తూ తెలంగాణ పరిస్థితిపై అధ్యయనం చేశారు. గత ఆరేళ్ల గణాంకాలను పరిశీలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణలోనే అత్యధికంగా బాల్య వివాహాలు నమోదవుతున్నాయి. 2019-21 మధ్యలో ఇక్కడ 23.5శాతం ఉండగా, కర్ణాటకలో 21.3, తమిళనాడులో 12.8, కేరళలో 6.3ుగా ఉంది. 2023-24లో చేసిన అధ్యయనంలో కాస్త తగ్గుదల కనిపించినా.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడే ఎక్కువగా ఉంది. రెండేళ్ల క్రితం తెలంగాణలో 17.9 శాతం ఉండగా, కర్ణాటకలో 15.3, తమిళనాడులో 10.5, కేరళలో 2.9 శాతంగా నమోదైంది. గతేడాది కేంద్రం నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలోనూ ఇదే అంశం తేలింది. ఈ లెక్కన ప్రతి ఆరు పెళ్లిళ్లలో ఒకటి బాల్య వివాహం అని తేలింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది.
బాల్య వివాహాల వల్ల బాలికల ఆరోగ్యం మరింతగా క్షీణిస్తోంది. వీరిలో 67శాతం మంది తీవ్ర రక్తహీనత, ఇతర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గర్భం దాల్చిన తర్వాత తల్లితోపాటు పుట్టబోయే బిడ్డ సైతం ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు విద్యాశాఖ అధ్యయనంలో తేలింది. గ్రామీణం, నగరం తేడా లేకుండా 18 ఏళ్ల లోపున్న బాలికల్లోని ప్రతి ముగ్గురిలో ఇద్దరు తీవ్ర రక్తహీనతను ఎదుర్కొంటున్నారని, ఇది భవిష్యత్తులో మరిన్ని అనారోగ్య సమస్యలకు కారణమవుతోందని తేలింది. ఇప్పుడు రాష్ట్రంలో 15-49 వయసున్న బాలికలు, మహిళల్లో గ్రామీణ ప్రాంతాల్లో 45శాతం మంది మాత్రమే హైస్కూల్ ఆపై చదువులు పూర్తిచేశారు.
మిగతా 55శాతం మంది 10వ తరగతి లేదా అంతకంటే తక్కువ విద్యార్హత కలిగి ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో 66.5 శాతం మహిళలు ఉన్నత పాఠశాల విద్య పూర్తిచేయగా.. 33.5 శాతం మంది 11వ తరగతికి చేరనేలేదు. అమ్మాయిలకు పదో తరగతి వరకు చదువు సరిపోతుందన్న భావన ఎక్కువమంది తల్లిదండ్రుల్లో ఉందని, అందువల్ల ఒకే పాఠశాలలో 12వ తరగతి వరకు ఉంటే వారు మరో రెండేళ్లపాటు విద్యను కొనసాగిస్తారని...తద్వారా బాల్య వివాహాలు ఆపడంతోపాటు వారిలో అనారోగ్య సమస్యలనూ తగ్గించవచ్చని విద్యాశాఖ తన నివేదికలో తెలిపింది. ఇంటర్ విద్య విలీనం వెనక ఇది కూడా ఓ ప్రధాన కారణమని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
పార్టీకి నష్టం చేసేలా మాట్లాడితే చర్యలు.. సీఎం రేవంత్రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
హైదరాబాద్లో ఉగ్రదాడుల హెచ్చరిక.. పోలీసుల హై అలర్ట్!
తెలంగాణలో ష్నైడర్ సంస్థ విస్తరణకు పూర్తి సహకారం అందిస్తాం: భట్టి విక్రమార్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News