ముందు మధ్యవర్తిత్వం.. తర్వాతే న్యాయ పోరాటం
ABN , Publish Date - Nov 08 , 2026 | 03:52 AM
‘‘ముందుగా మధ్యవర్తిత్వాన్ని ప్రయత్నిద్దాం.. ఆ తర్వాతే న్యాయ పోరాటానికి వెళ్దాం’’ అనే సంస్థాగత దృక్పథాన్ని న్యాయవాదులు అలవర్చుకోవాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ శామ్ కోషీ పిలుపునిచ్చారు.
ఆ దృక్పథాన్ని అలవర్చుకోవాలి: హైకోర్టు సీజే శామ్ కోషీ
మధ్యవర్తిత్వంతో కుదిరే పరిష్కారాలకు చట్టబద్ధత ఉండాలి
నిర్దిష్ట సంస్కరణలు అవసరం: జస్టిస్ మౌసుమీ భట్టాచార్య
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): ‘‘ముందుగా మధ్యవర్తిత్వాన్ని ప్రయత్నిద్దాం.. ఆ తర్వాతే న్యాయ పోరాటానికి వెళ్దాం’’ అనే సంస్థాగత దృక్పథాన్ని న్యాయవాదులు అలవర్చుకోవాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ శామ్ కోషీ పిలుపునిచ్చారు. మధ్యవర్తిత్వం అనేది న్యాయ విచారణ నుంచి వెనక్కి తగ్గడం కాదని, తప్పనిసరిగా అవసరమైన కేసులకే ఆ ప్రక్రియను పరిమితం చేసేందుకు దోహదపడుతుందని వివరించారు. వినియోగదారుల న్యాయవ్యవస్థలో మధ్యవర్తిత్వాన్ని అంతర్భాగంగా అభివృద్ధి చేయాలని అభిప్రాయపడ్డారు. ఖైరతాబాద్‌లోని ఎరువాక భవన్‌లో శనివారం తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్, హైదరాబాద్ బార్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ‘‘వినియోగదారుల వివాదాల్లో మధ్యవర్తిత్వం: ఆచరణాత్మక, కార్యాచరణ దృక్పథంలో అవగాహన’’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు.
మధ్యవర్తిత్వ ప్రక్రియపై అవగాహన లేకపోవడం, చర్చల్లో ఇరు పక్షాల మధ్య సమాన అవగాహన లేకపోవడం, వివాదాల స్వభావం, మధ్యవర్తుల సన్నద్ధత, సంస్థల మధ్య సమన్వయం వంటి అంశాలు ప్రధాన సవాళ్లుగా ఉన్నాయని పేర్కొన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మౌసుమీ భట్టాచార్య మాట్లాడుతూ మధ్యవర్తిత్వాన్ని సమర్థంగా అమలు చేసేందుకు నిర్దిష్టమైన సంస్కరణలు అవసరమని పేర్కొన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా కుదిరే పరిష్కారాలకు చట్టబద్ధత, తుది నిర్ణయ స్వభావం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదు దాఖలు చేసే దశలోనే మధ్యవర్తిత్వాన్ని ఒక ప్రత్యామ్నాయంగా ఉండాలని ప్రతిపాదించారు. టీఎ్‌ససీడీఆర్‌సీ అధ్యక్షురాలు జస్టిస్ జి.రాధారాణి మాట్లాడుతూ నాణ్యత లేని ఉత్పత్తులు, సేవల్లో లోపాలు, బీమా క్లెయిమ్‌లు, బ్యాంకింగ్ లావాదేవీలు, గృహ ప్రాజెక్టులకు సంబంధించిన వివాదాల్లో మధ్యవర్తిత్వానికి మంచి అవకాశాలు ఉన్నాయన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News