హైడ్రా కమిషనర్ సహా ఇతరుల ప్రత్యక్ష హాజరుకు హైకోర్టు ఆదేశం
ABN , Publish Date - Nov 07 , 2026 | 04:29 AM
ఓ కోర్టు ధిక్కరణ కేసులో ప్రత్యక్షంగా హాజరు కావాలంటూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సహా పలువురు అధికారులకు హైకోర్టు ఫారం-1 నోటీసులు జారీచేసింది.
కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించి భవనాలను కూల్చినట్టు కేసు
హైదరాబాద్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఓ కోర్టు ధిక్కరణ కేసులో ప్రత్యక్షంగా హాజరు కావాలంటూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సహా పలువురు అధికారులకు హైకోర్టు ఫారం-1 నోటీసులు జారీచేసింది. పురపాలన పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి టీకే శ్రీదేవి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులకు కూడా నోటీసులు పంపించింది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూర్‌లోని సర్వే నెంబర్ 175(పార్ట్), 173 (పార్ట్) తదితర సర్వే నెంబర్లలోని దాదాపు 36.37 ఎకరాలు ప్రైవేటు పట్టా భూమి అని, దాంట్లోని నిర్మాణాలను కూల్చివేయరాదంటూ హైకోర్టు 2024లో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘించినట్టు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలయింది.
దీనిపై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. అక్కడ కూల్చివేతలు చేపట్టరాదని, ఒకవేళ ఫుల్‌ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్)లో నిర్మాణాలు ఉన్నాయని భావిస్తే చట్టప్రకారం నోటీసులు జారీచేసి సర్వే చేపట్టాలని హైకోర్టు ఉత్తర్వులు జారీచేసిందని తెలిపారు. వాటిని ఉల్లంఘిస్తూ కూల్చివేతలు చేపట్టడమే కాకుండా 800 ఎకరాల ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు మీడియాలో ప్రకటనలు చేశారని ఆరోపించారు. వాదనలు విన్న ధర్మాసనం అధికారులకు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను డిసెంబర్ 4కు వాయిదా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన
Read Latest AP News And Telangana News And National News
And Telugu News