నేడు రాష్ట్రంలో వర్షాలు
ABN , Publish Date - Oct 28 , 2026 | 05:12 AM
రాష్ట్రంలో బుధవారం వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉదయం 8.30 గంటల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియవచ్చని వెల్లడించింది.
కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీగా కురిసే అవకాశం
తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
హైదరాబాద్, హైదరాబాద్ సిటీ, శంషాబాద్ రూరల్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో బుధవారం వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉదయం 8.30 గంటల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియవచ్చని వెల్లడించింది. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలు... జయశంకర్-భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. మిగతా జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. కాగా ఆంధ్రప్రదేశ్‌లో అర్నబ్ తుపాను కారణంగా సోమవారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే పలు విమానాలకు అంతరాయం ఏర్పడింది.
విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాలకు రాకపోకలు సాగించే పలు విమానాలు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తుపాను కారణంగానే విమానాలు రద్దయ్యాయని జీఎంఆర్ సంస్థ ప్రకటించింది. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉండవచ్చని ఎయిర్‌పోర్టు వర్గాలు చెబుతున్నాయి. తుపాను కారణంగా కోస్తాంధ్ర జిల్లాలతో పాటు తూర్పు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, సికింద్రాబాద్ డివిజన్ డీఆర్‌ఎం గోపాలకృష్ణన్‌తో కలిసి వివిధ విభాగాల ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించారు.
రైలు ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ఐఆర్‌సీటీసీ, రైల్‌వన్, ఎన్‌టీఈఎస్ తదితర అధికారిక రైల్వే అప్లికేషన్ల నుంచి రైళ్ల ప్రస్తుత స్థితిని సరిచూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైళ్ల రద్దు/దారి మళ్లింపు సమాచారాన్ని రైల్వే సోషల్‌మీడియా సైట్‌ల నుంచి పొందవచ్చన్నారు. తుపాను కారణంగా మంగళవారమే 11 రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. అందులో 12704 ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, 17016 విశాఖ ఎక్స్‌ప్రెస్, 12728 గోదావరి ఎక్స్‌ప్రెస్, 12862 మహబూబ్‌నగర్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్, 12776 కోకనాడ ఎక్స్‌ప్రెస్, 17256 నర్సపూర్ ఎక్స్‌ప్రెస్, 12738 గౌతమి ఎక్స్‌ప్రెస్, 20810 నాగావళి ఎక్స్‌ప్రెస్, 07037/07038 చర్లపల్లి-శ్రీకాకుళం-చర్లపల్లి ప్రత్యేకరైళ్లు ఉన్నాయి.
వణికిస్తున్న చలి గాలులు
హైదరాబాద్‌లో చలి తీవ్రత పెరిగింది. తెల్లవారు జామున ప్రధాన రహదారులను మంచు కప్పేస్తోంది. నాలుగు రోజులుగా శివారు ప్రాంతాల్లో చలి గాలులు వణికిస్తున్నాయి. పటాన్‌చెరులో మంగళవారం అత్యల్పంగా 13.2 డిగ్రీలు, రాజేంద్రనగర్‌లో 18.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో రెండు రోజుల పాటు ఇదే తరహా వాతావరణం కొనసాగుతుందని బేగంపేట వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నగరంలో రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపారు. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంటుందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
రేషన్ బియ్యం.. బ్రాండెడ్ దందా
Read Latest AP News And Telangana News And International News And Telugu News